ఏడాదిలో మండలి సగం ఖాళీ

23 Jan, 2021 00:48 IST|Sakshi

ఈ ఏడాది జూన్‌లోగా తొమ్మిది మంది ఎమ్మెల్సీల పదవీ విరమణ

వచ్చే జనవరిలోగా మరో 12 మంది సభ్యుల పదవీకాలం పూర్తి

వీరిలో 20 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలే

ఆశావహుల్లో అప్పుడే సందడి... ఎవరి లెక్కల్లో వాళ్లు

అధినేత ఇచ్చిన హామీతో చాన్స్‌ దక్కుతుందని కొందరి ధీమా

మరో ‘టర్మ్‌’పై మరికొందరి ఆశ

రిటైర్‌ అవుతున్న సభ్యుల జాబితాలో మండలి చైర్మన్‌ గుత్తా, వైస్‌ చైర్మన్‌ నేతి

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం, చీఫ్‌ విప్‌ బోడకుంటి పదవీకాలం కూడా పూర్తి

వచ్చే ఏడాది ‘లోకల్‌ బాడీ’లో కవిత సహా 12 మంది రిటైర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ రాజకీయ నాయకులకు కొలువుల జాతర రానుంది. ఒకవైపు నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి అధిష్టానం కసరత్తు చేస్తుండగా... మరోవైపు ఏడాది కాలంలో భారీ సంఖ్యలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు వారిని ఊరిస్తున్నాయి. అధికారిక ‘హోదా’కోసం ఆరాటపడుతున్న వారంతా... ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు.పైగా మెజారిటీ (స్థానిక సంస్థల్లో, ఎమ్మెల్యేల కోటాలో) తమవైపే ఉంది కాబట్టి గెలుపు ఖాయమనే ధీమాలో ఆశలు పెంచేసుకుంటున్నారు. శాసనమండలిలోని మొత్తం 40 మంది సభ్యులకుగాను వచ్చే ఏడాది జనవరి నాలుగో తేదీలోగా సగానికి పైగా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ ఏడాది మార్చి 29 నాటికి పట్టభద్ర ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్‌.రాంచందర్‌రావు పదవీకాలం పూర్తవుతుండటంతో ఇప్పటికే ఎన్నికల సందడి ప్రారంభమైంది. వీరితో పాటు శాసనసభ్యుల కోటా నుంచి మండలికి ఎన్నికైన మరో ఆరుగురు సభ్యుల పదవీకాలం కూడా ఈ ఏడాది జూన్‌ 3న ముగియనుంది.

శాసనసభ్యుల కోటా నుంచి పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల జాబితాలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఫరీదుద్దీన్, ఆకుల లలిత ఉన్నారు. వీరితో పాటు గవర్నర్‌ కోటాలో ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రొఫెసర్‌ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలపరిమితి కూడా ఈ ఏడాది జూన్‌ 16న ముగియనుంది. ఈ ఏడాది పదవీ విరమణ చేస్తున్న తొమ్మిది మంది ఎమ్మెల్సీల్లో ఎన్‌.రామచందర్‌రావు (బీజేపీ) మినహా మిగతా ఎనిమిది మంది టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. కాగా శాసనమండలికి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన 14 మందిలో 12 మంది వచ్చే ఏడాది జనవరి 4న పదవీ కాలపరిమితి పూర్తి చేసుకుంటారు.

వీరిలో నిజామాబాద్‌ నుంచి ఎన్నికైన కల్వకుంట్ల కవితతో పాటు పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), టి.భానుప్రసాద్‌ (కరీంనగర్‌), పురాణం సతీష్‌ (ఆదిలాబాద్‌), నారదాసు లక్ష్మణ్‌రావు (కరీంనగర్‌), వి.భూపాల్‌రెడ్డి (మెదక్‌), సుంకరి రాజు (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్‌), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్‌), తేరా చిన్నపరెడ్డి (నల్గొండ) ఉన్నారు. మొత్తంగా వచ్చే ఏడాది జనవరి 4వ తేదీలోగా ఖాళీ అయ్యే 21 శాసనమండలి స్థానాల్లో 20 మంది టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యులే ఉన్నారు.

మళ్లీ అడుగు పెట్టేదెవరో?
పట్టభద్రుల కోటాలో రెండు స్థానాలు ఈ ఏడాది మార్చి 29న ఖాళీ అవుతుండటంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ‘వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ’పట్టభద్రుల నియోజవకర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మరోమారు పోటీ చేయడం ఖాయమైంది. మరో పట్టభద్రుల నియోజకవర్గం ‘హైదరాబాద్‌–రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌’నుంచి బీజేపీకి చెందిన రాంచందర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో ఫలితాలు ఎలా వచ్చినా... వచ్చే ఏడాది జనవరిలోగా ఖాళీ అయ్యే మరో 19 శాసనమండలి స్థానాలు తిరిగి టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే చేరే అవకాశముంది. అటు శాసనసభలో, ఇటు స్థానికసంస్థల్లో టీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయిలో బలం ఉండటంతో ఆయా కోటా శాసనమండలి స్థానాలకు జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే తిరిగి ఎన్నికయ్యే అవకాశముంది.

అందుకే ఆశావహుల్లో పోటీనెలకొంది. రాష్ట్ర విభజన తర్వాత శాసన మండలిలో మెజారిటీ కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలను ప్రోత్సహించడంతో వివిధ సందర్భాల్లో పలువురు ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిలో వి.భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, టి.భానుప్రసాద్‌ తదితరులకు రెండో పర్యాయం కూడా ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఈ టర్మ్‌ ముగిశాక వీరి భవితవ్యం ఏమిటనే ఆసక్తి నెలకొంది. టీఆర్‌ఎస్‌ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మంత్రివర్గంలో చోటు దక్కని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొంది. ఫరీదుద్దీన్, నేతి విద్యాసాగర్, ఆకుల లలితను మండలికి మళ్లీ నామినేట్‌ చేసేందుకు ఎంత మేర అవకాశాలున్నాయనే అంశంపై చర్చ జరుగుతోంది. 

‘చైర్మన్‌’గా గుత్తా కొనసాగింపు!
గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019 ఆగస్టులో శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక కాగా, అదే ఏడాది సెప్టెంబర్‌లో మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్‌ 3న ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం ముగియనున్న ఈ నేపథ్యంలో మరోమారు గుత్తా సభ్యత్వాన్ని పొడిగించడంతో పాటు మండలి చైర్మన్‌గా కొనసాగించే యోచనలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు సమాచారం. 

ఆశావహులు ఎందరో...
శాసనమండలిలో సగానికి పైగా స్థానాలు రెండు విడతలుగా ఖాళీ అవుతుండటంతో ఔత్సాహికుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలు, సామాజికవర్గాల సమీకరణాల్లో తమకు ఎంత మేర అవకాశముందనే లెక్కలు వేసుకుంటూ... మండలిలో చోటు కోసం ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారితో పాటు వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నాయకులు, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కని వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని కేసీఆర్‌ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు.

ఔత్సాహికుల జాబితాలో మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ గుండు సుధారాణి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్, మాజీ విప్‌ కర్నె ప్రభాకర్‌ ఉన్నారు. వీరితో పాటు కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్‌రావు, కరీంనగర్‌ మాజీ జడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, క్యామ మల్లేశ్‌ యాదవ్‌లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం కార్యాలయ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, బ్రేవరేజెస్‌ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీ ప్రసాద్‌ తదితరులు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నారు.

శాసనమండలి కూర్పు ఇలా...
స్థానిక సంస్థల కోటాలో ఎన్నికయ్యేవారు 14
శాసనసభ్యుల ఎన్నుకొనేవారు 14
గవర్నర్‌ కోటాలో నామినేటెడ్‌ 6
పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి 3
ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుంచి 3
మొత్తం: 40 

ప్రస్తుతం ఎవరికెంత బలం...
ప్రస్తుతం శాసనమండలిలో ఎంఐఎంకు ఇద్దరు, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉపాధ్యాయుల కోటా నుంచి ఎన్నికైన ముగ్గురు సభ్యుల్లో ఎ.నర్సిరెడ్డి మినహా మిగతా ఇద్దరు టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్నారు. దీంతో శాసనమండలిలో 40 మంది సభ్యులకు గాను 35 మందిని టీఆర్‌ఎస్‌కు చెందిన వారిగానే పరిగణించొచ్చు.

మరిన్ని వార్తలు