కరోనాను మించి ముంచుతోంది!

23 Feb, 2022 04:13 IST|Sakshi

ఏటా కాలుష్యం బారినపడి 90 లక్షల మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండేళ్లుగా సృష్టిస్తున్న బీభత్సాన్ని చూస్తున్నాం. ఈ కోరల నుంచి మానవాళి ఇంకా బయటపడలేదు. దీంతో లక్షలాది మంది మృత్యువాతపడుతూనే ఉన్నారు. అయితే, దీనికి మించిన ముప్పు మరోటి ఉంది.. అదే కాలుష్యం. కరోనా భూతం కంటే ఎక్కువ మందిని పొట్టనపెట్టుకుంటోంది దీనిపై ఐక్యరాజ్యసమితి తాజాగా ఓ నివేదిక రూపొందించింది. అదేంటో చూద్దాం..!
– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

కాలుష్యంతో పర్యావరణంతోపాటు ప్రాణికోటికి పెనుముప్పు పొంచి ఉంది. కోవిడ్‌–19 కన్నా కాలుష్యంతో మరణించిన వారి సంఖ్య ఎక్కువ ఉందని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక చెప్పిందంటే దీని తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎరువులు, ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఏటా 90 లక్షల మంది అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారని చెప్పింది. కరోనా వచ్చిన మొదటి 18 నెలల కాలంలో చనిపోయినవారి సంఖ్యకు ఇది రెట్టింపు ఉండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. ఇంత జరుగుతున్నా దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. కరోనా వల్ల రెండేళ్లలో దాదాపు 60 లక్షల మంది మరణించారు.

స్వచ్ఛ పర్యావరణం మన హక్కు
‘కాలుష్యం, విషపూరితాల నియంత్రణకు మనం చేస్తున్న విధానాలు సరిగా లేవు. ఫలితంగా స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పొందాలన్న హక్కుకు పెద్ద ఎత్తున ఉల్లంఘన జరుగుతోంది. కాలుష్యకట్టడికి చట్టపరంగా ముందుకెళ్తేనే మంచి ఫలితాలు సాధించే అవకాశముంది’ అని ఐరాస ప్రత్యేక ప్రతినిధి డేవిడ్‌ బోయిడ్‌ చెప్పారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన ఐక్యరాజ్యసమితి.. తక్షణమే విషపూరితరసాయనాలు నిషేధించాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చింది. స్వచ్ఛమైన పర్యావరణం మానవుల హక్కు అని స్పష్టంచేసింది.

నాన్‌స్టిక్‌ పాత్రలతోకూడా... 
పాలీఫ్లోరోఆల్కైల్, పర్‌ఫ్లోరోఆల్కైల్‌తో తయారయ్యే నాన్‌స్టిక్‌ వంటపాత్రలతో ఆరోగ్యానికి ముప్పు అని ఐరాస పేర్కొంది. ఇవి కేన్సర్‌కు దారితీస్తాయని, ఇలాంటి వాటిని నిషేధించా ల్సిన అవసరం ఎంతైనా ఉందని తేల్చిచెప్పింది. ఈ రసాయనాలను అంత సులభంగా అంతం చేయలేమంది. అందుకే వీటిని ‘చిరకాలం ఉండే రసాయనాలు’గా అభివర్ణించింది.

అలాగే, పేరుకుపోయిన వ్యర్థాలతో ఆరోగ్యం దెబ్బతింటుందని, వ్యర్థాలున్న ప్రాంతాలను శుభ్రం చేయాలని చెప్పింది. లేకపోతే ఆయా ప్రాంతాల్లో నివసించేవారిపై తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని, అందువల్ల వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించింది. పర్యావరణ మప్పు అనేది ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్‌ అని ఐరాస హక్కుల అధినేత మైకేల్‌ బాచ్లెట్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు