94.75 శాతానికి తగ్గిన డెంగీ కేసులు  

25 Sep, 2020 03:45 IST|Sakshi

గతేడాది 13,331 కేసులు.. ఈ ఏడాది 699 మాత్రమే 

చికున్‌గున్యా కేసులు 5,352.. ఈసారి 364

మలేరియా కేసులు 1,711.. ఇప్పుడు 570

కరోనా కట్టడి చర్యల వల్ల తగ్గిన సీజనల్‌ వ్యాధులు

మరోవైపు ఇళ్లలో పెరిగిన శుభ్రత.. ఆరోగ్యంపై శ్రద్ధ

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ కేసులు గణనీయంగా తగ్గాయి. గతేడాది కేసులతో పోలిస్తే ఈసారి ఏకంగా 94.75 శాతానికి తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందుకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపించింది. ఆ వివరాలను కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో సీజనల్‌ వ్యాధులపై తాజాగా జాతీయ నివేదికను విడుదల చేసింది. కరోనా కారణంగా ఇళ్లల్లో పరిశుభ్రత పెరగడం..  వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశుద్ధ్యంపై  ప్రత్యేక  దృష్టి సారించడం.. ప్రజలు మాస్క్‌లు ధరించడంతో ఫ్లూ వంటి సీజనల్‌ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పరిస్థితి తగ్గిందని వెల్లడించింది. దీంతో సీజనల్‌ వ్యాధులు ఈసారి తగ్గిపోయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.  

ఈ ఏడాది 699 డెంగీ కేసులు.. 
వరుసగా మూడేళ్లపాటు దేశంలో వర్షాకాల సీజన్‌లో డెంగీ కేసులు గణనీయంగా నమోద య్యాయి. 2017లో దేశంలో 1.88 లక్షల కేసులు నమోదు కాగా, 325 మంది చనిపో యారు. 2018లో 1.01 లక్షల కేసులు రికార్డు కాగా, 172 మంది మరణించారు. 2019లో 1.57 లక్షల కేసులు నమోదు కాగా, 166 మం ది చనిపోయారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో 13,587 డెంగీ కేసులు నమోదవ్వగా, 9 మంది చనిపోయారు. ఇక గతేడాది తెలంగాణలో డెంగీతో జనం విలవిలలాడిపోయారు. సరాసరి ప్రతీ ఇంట్లోనూ జ్వరం కేసులు నమోదయ్యాయి.

2017లో తెలంగాణలో 5,369 డెంగీ కేసులు నమోదైతే, 2018లో 4,592 కేసులు వచ్చాయి. 2019లో ఏకంగా 13,331 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలో 699 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే గతేడాది కేసులతో పోలిస్తే ఈసారి 5.25 శాతమే రికార్డయ్యాయి. ఒకవేళ మున్ముందు కొద్దిపాటి కేసులు నమోదైనా సీజన్‌ ముగుస్తున్నందున తీవ్రత పెద్దగా ఉండదని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇక గతేడాది రాష్ట్రంలో మలేరియా కేసులు 1,711 రికార్డవ్వగా, ఈ ఏడాది జూలై వరకు 570 కేసులు నమోదయ్యాయి. అలాగే చికున్‌గున్యా కేసులు గతేడాది 5,352 నమోదవ్వగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 364 కేసులే వచ్చాయి.  

కరోనా, సీజనల్‌ వ్యాధులపై సర్కార్‌ చర్యలు
► ఇంటింటి సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించారు. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేస్తూనే, మరోవైపు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధులను నియంత్రించడంపై దృష్టి సారించారు. ఒక్కో ఆశ కార్యకర్త 50 ఇళ్లకు వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహించారు.  
► కరోనా నిబంధనలను పాటించడంపై ప్ర జలను చైతన్యం చేయడంతో పాటు దోమ ల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. 
► కరోనా జాగ్రత్తలతో పాటు ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జనాన్ని జాగృతం చేశారు.  
► అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు.  
► మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖలతో కలసి దోమల నిర్మూలన కార్యక్రమాలను చేపట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది.

సీజనల్‌ వ్యాధుల నుంచి కాపాడిన మాస్క్‌లు 
కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యంపై సర్కారు పటిష్టమైన చర్యలు చేపట్టింది. దీంతో దోమల నిర్మూలన జరిగింది. ప్రజలు కరోనా నుంచి బయటపడేందుకు మాస్క్‌ లు ధరించారు. భౌతిక దూరం పాటించారు. దీంతో జలుబు, జ్వరం వంటి ఫ్లూ వంటి లక్షణాలున్న వారి నుంచి ఇతరు లకు వ్యాప్తి తగ్గింది. దోమల నిర్మూలన కార్యక్రమాలతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు గణనీయంగా తగ్గాయి. ఇక ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది. కరోనా నేపథ్యంలో ఇటువంటి చర్యలు తీసుకోవడంతో సీజనల్‌ వ్యాధులు తగ్గిపోయాయి.
– డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు  

మరిన్ని వార్తలు