అల్జీమర్స్‌కు స్మార్ట్‌ వాచ్‌ కనిపెట్టిన 9వ తరగతి విద్యార్థి

26 Jan, 2021 08:38 IST|Sakshi

ప్రధాన మంత్రి ప్రశంసలు అందుకున్న హిమేష్‌ 

సాక్షి, బంజారాహిల్స్‌: అమ్మమ్మ పడుతున్న అవస్థలను చూసిన ఆ బాలుడి మనసు కరిగిపోయింది. ఆ కష్టాలకు చెక్‌ పెట్టాలన్న ఆలోచన పుట్టింది. అల్జీమర్‌ వ్యాధితో తన అమ్మమ్మలాగే కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా బాధపడుతున్నారని తెలుసుకున్న ఆ బాలుడు పరిష్కారం చూపాలని మూడేళ్లు కష్టపడి మొత్తానికి అందులో విజయం సాధించాడు.

 జుబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న చదలవాడ హిమేష్‌ అల్జీమర్స్‌ వ్యాధి ఉన్నవారి ఆరోగ్య పరిరక్షణకు స్మార్ట్‌ వాచ్‌ కనిపెట్టి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌ అవార్డ్‌–2021ను గెలుచుకున్నాడు.
⇔ గుంటూరుకు చెందిన హిమేష్‌ తండ్రి కిశోర్‌కుమార్‌ ఆడియో ఇంజినీర్‌ కాగా, తల్లి సంధ్య గృహిణి.
⇔ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు చెందిన హిమేష్‌ ఈ యంత్రాన్ని కనిపెట్టడంలో చేసిన కృషికి సోమవారం ప్రధాన మంత్రి నిర్వహించిన వర్చువల్‌ మీటింగ్‌కు కూడా హిమేష్‌ హాజరయ్యాడు. వృద్ధులను, వికలాంగులను పర్యవేక్షించడానికి స్మార్ట్‌ రిస్ట్‌ బ్యాండ్‌ తోడ్పడుతుందని హిమేష్‌ తెలిపాడు.  
⇔ ప్రపంచంలో ప్రతి మూడు సెకన్లలో ఒక వ్యక్తి అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నారని, అందులో మా అమ్మమ్మ కూడా ఒకరన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి రోగులందరికీ ఈ పరికరం ఉపయోగపడుతుందని చెప్పాడు.  
⇔ ఈ పరికరాన్ని అల్జీమర్స్‌ రోగులు ధరిస్తారని, ఇది వారి ఆరోగ్య స్థితిని పరిరక్షించడమే కాకుండా సంచారం, పల్స్, బీపీ వంటి రోగాలను గురించి తెలియజేస్తుందని తెలిపారు. రోగికి ఏదైనా అసాధారణ పరిస్థితి ఎదురైతే ఒక హెచ్చరిక ఇవ్వడమే కాకుండా ఆ సమాచారాన్ని పంపుతుందన్నాని వివరించాడు. 
⇔ అల్జీమర్స్‌ వ్యాధి సోకిన వారి ఆరోగ్య పరిరక్షణ కోసం స్మార్ట్‌ వాచ్‌ కనిపెట్టిన చదలవాడ హిమేష్‌ను రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్‌ సోమవారం సత్కరించి బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులను అభినందించారు.  

మరిన్ని వార్తలు