పుట్టగానే ఆధార్‌!

1 May, 2022 03:59 IST|Sakshi

ఆస్పత్రి నుంచే నేరుగా మున్సిపాలిటీలకు సమాచారం

అదే రోజున ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ను కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

చిన్నారుల ఫొటో లేకుండానే.. తల్లిదండ్రుల ఆధార్, చిరునామా ఆధారంగా నమోదు

దేశంలోనే తొలిసారిగా సరికొత్త ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ

ఇప్పటికే యూఐడీఏఐతో చర్చలు.. వారం, పది రోజుల్లో అమల్లోకి!

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: అప్పుడే పుట్టిన శిశువులకు వెంటనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ రానుంది. పిల్లలు జన్మించిన ఆస్పత్రుల నుంచి సమాచారం తీసుకుని.. అదే రోజున ఆధార్‌కు ఎన్‌రోల్‌ చేసేలా రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పురపాలక శాఖ జనన నమోదు పోర్టల్‌ను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)కు అనుసంధానం చేయనుంది. వారం, పదిరోజుల్లోనే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారి అని పురపాలక శాఖ అధికారులు చెప్తున్నారు.

జననాల పోర్టల్‌ నుంచి..
ఆస్పత్రులు ఆన్‌లైన్‌ ద్వారా ఏ రోజుకారోజు జననాల వివరాలను నమోదు చేస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను నిర్వహిస్తోంది. ఆస్పత్రులు శిశువు తల్లిదండ్రుల పేర్లు, ఆధార్‌ నంబర్లు, చిరునామా, పుట్టిన తేదీ, సమయం, లింగం, వయసు వివరాలను సేకరించి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాయి. ఈ సమాచారాన్ని వినియోగించి.. నవజాత శిశువులకు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ను కేటాయించడానికి రాష్ట్ర పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు యూఐడీఏఐతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది.

జనన నమోదు ప్రక్రియ ముగిసిన వెంటనే తల్లిదండ్రుల మొబైల్‌ ఫోన్‌కు జనన ధ్రువీకరణ పత్రం డౌన్‌లోడ్‌ లింక్‌తోపాటు ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ సైతం ఎస్సెమ్మెస్‌ల రూపంలో అందుతుందని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తల్లిదండ్రులు ఆ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌తో మీసేవ కేంద్రం నుంచి ఆధార్‌కార్డును పొందడానికి వీలుంటుందని వివరించారు. పుట్టినబిడ్డలకు వెంటనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ కేటాయింపు ఇప్పటివరకు ఎక్కడా ప్రారంభం కాలేదని.. తొలిసారిగా రాష్ట్రంలోనే అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు.

నీలి రంగు ఆధార్‌ కార్డు
యూఐడీఏఐ ఐదేళ్లలోపు పిల్లల కోసం నీలిరంగులో తాత్కాలిక ఆధార్‌ కార్డులను జారీ చేస్తుంది. దీనికోసం శిశువుల బయోమెట్రిక్‌ డేటా సేకరించరు. పిల్లల ఫొటో, తల్లిదండ్రు ల సమాచారం, చిరునామా, మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలను మీసేవ కేంద్రాలు లేదా యూఐడీఏఐ కార్యాలయాల్లో ఇవ్వొచ్చు.  ఐదేళ్లు దాటాక బయోమెట్రిక్‌ డేటా ఇచ్చి శాశ్వత ఆధార్‌ కార్డును పొందాలి. 15 ఏళ్ల వ యసు తర్వాత మరోసారి బయోమెట్రిక్‌ డేటా ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  

తల్లిదండ్రులకు ఊరట..
దేశంలో చాలా సేవలు, సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డు కీలకంగా మారింది. వ్యక్తిగత, చిరునామా గుర్తింపులోనూ, పాఠశాలలో ప్రవేశాలలో అవసరంగా మారింది. ఈ నేపథ్యంలో శిశువులకు వెంటనే ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ జారీ చేయనుండటం తల్లిదండ్రులకు ఊరట కలిగించనుంది. 

మరిన్ని వార్తలు