ఇంజనీరింగ్‌లో ఇక నిఖార్సైన బోధన

11 Oct, 2021 01:40 IST|Sakshi

తప్పనిసరి కానున్న అధ్యాపకుల ఆధార్‌–బయోమెట్రిక్‌ హాజరు 

అర్హతలున్న ప్రొఫెసర్లతోనే బోధనకు వీలు.. మోసాలకు చెక్‌

సాఫ్ట్‌వేర్‌ ద్వారా పర్యవేక్షించనున్న జేఎన్‌టీయూహెచ్‌ 

ఈ నెల 16 తర్వాత అమల్లోకి రానున్న ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ కాలేజీల్లో ఈ నెల 16 తర్వాత ఆధార్‌ అనుసంధానిత బయోమెట్రిక్‌ హాజరును జేఎన్‌టీయూహెచ్‌ తప్పనిసరి చేయనుంది. అన్ని కాలేజీలతో అనుసంధానమవుతూ హాజరు పర్యవేక్షణకు ఇప్పటికే ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. దీనివల్ల సంబంధిత సబ్జెక్టులను అర్హులైన అధ్యాపకులే బోధించాల్సి రానుంది.

దీంతో ఇప్పటివరకు చాలా కాలేజీలు అనర్హులతో చేపడుతున్న విద్యా బోధనకు తెరపడనుంది. అలాగే అధ్యాపకులకు కాలేజీలు నిర్దిష్ట సమయంలోనే వేతనాలు చెల్లించాల్సి రానుంది. నిజానికి బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను ఈ నెల ఒకటి నుంచే ప్రారంభిస్తామని జేఎన్‌టీయూహెచ్‌ గత నెలలోనే ప్రకటించింది. అయితే ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని భావించడంతో కొంత జాప్యమైనట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. 

ఏళ్ల తరబడి మోసం... 
జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో 145 ఇంజనీరింగ్, 70 ఫార్మసీ, 10 మేనేజ్‌మెంట్‌ కాలేజీలు ఉండగా వాటిల్లో 30 వేల మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం అధ్యాపకుడు తప్పనిసరిగా ప్రొఫెసర్‌ అయి ఉండాలి. అలాగే ప్రిన్సిపాల్‌ విధిగా పీహెచ్‌డీ చేసి ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఫ్యాకల్టీ విషయంలో విద్యార్థులను మోసం చేస్తున్నాయి. అర్హత లేని వారితో బోధన కొనసాగిస్తున్నాయి. దీనివల్ల విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి.

గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్యను అందుకుంటున్న వాళ్లు 40 శాతం మందే ఉన్నారు. మిగతా విద్యార్థులు ఉపాధి కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా మంది బ్యాక్‌లాగ్స్‌తో నెట్టుకొస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికే బయోమెట్రిక్‌ తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నిబంధనల మేరకు బయోమెట్రిక్‌ అమలు చేస్తున్నా ఇందులో లొసుగులున్నాయని జేఎన్‌టీయూహెచ్‌ క్షేత్రస్థాయి అధ్యయనంలో గుర్తించింది. 

ఆధార్‌ లింక్‌ తప్పనిసరి 
ఆధార్‌ అనుసంధానిత బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి కానుండటంతో అధ్యాపకుడు ఉదయం, సాయంత్రం బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వేయాల్సి ఉంటుంది. ఇది జేఎన్‌టీయూహెచ్‌కు అనుసంధానమై ఉంటుంది కాబట్టి అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించేందుకు అవకాశం లభించనుంది. అధికారులు బయోమెట్రిక్‌ నమోదు వివరాలను ఆయా కాలేజీల సమయాలతో సరిపోల్చుకొనేందుకు మార్గం ఏర్పడనుంది.

అలాగే అధ్యాపకుల ఆధార్‌ నంబర్లను బయోమెట్రిక్‌ విధానానికి అనుసంధానించనుండటం వల్ల వారి వేతన వివరాలు తేలికగా తెలిసిపోతాయి. కాలేజీల నుంచి వేతనం అందుతోందా? వారు మరెక్కడైనా పనిచేస్తున్నారా? అనే వివరాలు తెలుస్తాయి. దీనివల్ల నకిలీ వ్యక్తులను రికార్డుల్లో చూపించడం కుదరదని అధికారులు అంటున్నారు. 

బయోమెట్రిక్‌తో ఉద్యోగాలు నిలబడతాయి 
ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను అధికారులు నిక్కచ్చిగా అమలు చేస్తే దాదాపు 30 వేల మంది అధ్యాపకులకు వేతనాలు సక్రమంగా అందుతాయి. దీనివల్ల ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్య అందుతుంది. కాలేజీల మోసాలకు కళ్లెం పడుతుంది. 
– అయినేని సంతోష్‌కుమార్‌ (రాష్ట్ర స్కూల్స్, టెక్నికల్‌ కాలేజీల అసోసియేషన్‌ అధ్యక్షుడు) 

విద్యార్థులకు మేలు
బయోమెట్రిక్‌ హాజరుతో ఆధార్‌ను అనుసంధానిస్తే అర్హత ఉన్న అధ్యాపకుడే బోధన చేయడం అనివార్యమవుతుంది. ఇది విద్యార్థులకు మేలు చేస్తుంది. ఆధార్‌ను లింక్‌ చేయాలన్న లక్ష్యంతోనే ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది.     
– ప్రొఫెసర్‌ నర్సింహారెడ్డి, జేఎన్‌టీయూహెచ్, వీసీ   

మరిన్ని వార్తలు