దేశంలోనే హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఆధార్‌ కార్డులు

19 Apr, 2021 13:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆధార్‌ నమోదులో హైదరాబాద్‌ రికార్డు సృష్టించింది. ఇక్కడి స్థానిక జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో ఆధార్‌ కార్డులను జారీ చేసి.. దేశంలోనే టాప్‌లో నిలిచింది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చినవారు, హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు.. ఇలా చాలా మంది ఇక్కడే ఆధార్‌కు నమోదు చేసుకోవడం.

దీనికి కారణం. 2021 ఏప్రిల్‌ 10వ తేదీ నాటికి గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆధార్‌ కార్డులు తీసుకున్నవారి సంఖ్య 1.21 కోట్లకు చేరినట్లు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భాగ్యనగరం దేశంలో టాప్‌లో నిలవగా.. ఢిల్లీ, ముంబై నగరాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. అక్కడ కూడా వలసలు ఎక్కువగా ఉండటమే జనాభా సంఖ్యను మించి ఆధార్‌ కార్డులు జారీ కావడానికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి.

ఉపాధికి, చదువుకు కేంద్ర బిందువుగా..
హైదరాబాద్‌ నగర జనాభా కోటి దాటేసింది. ఉపాధి, విద్యావకాశాలు ఎక్కువగా ఉండటం మన రాష్ట్రంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల వారు సిటీకి వలస వస్తున్నారు. హైదరాబాద్‌ ఐటీ, హెల్త్‌, పారిశ్రామిక హబ్‌గా మారింది. స్థిరాస్తి, నిర్మాణ రంగం పుంతలు తొక్కుతున్నాయి. అన్ని ప్రాంతాల వారు నివసించేందుకు అనువైన వాతావరణం, జీవన వ్యయం సాధారణంగా ఉండటం, భాషా సమస్య లేకపోవడం వంటివి మరింత కలిసి వస్తున్నాయి. దీంతో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, అస్సాం, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల వారూ వలస వస్తున్నారు.

ఇక చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు కూడా ఏళ్లకేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇదే సమయంలో.. పలు రకాల పౌర సేవలు, బ్యాంకింగ్, వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్‌ అవసరం ఉండటంతో.. చాలా మంది ఇక్కడే నమోదు చేసుకోవడం మొదలుపెట్టారు. వేరే రాష్ట్రాల్లో అప్పటికే నమోదు చేసుకున్నవారు కూడా ఇక్కడి చిరునామాకు మార్చుకుంటున్నారు. మొత్తంగా హైదరాబాద్‌ జనాభా కంటే ఆధార్‌ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమయ్యాయి.

జనాభా పెరుగుదల తగ్గింది
హైదరాబాద్‌లో ఏటా జనాభా పెరుగుతున్నా.. ఈ పెరుగుదల రేటు మాత్రం ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. 1991 నుంచి 2001 మధ్య జనాభా పెరుగుదల రేటు 28.91% ఉండగా.. 2011 నాటికి 26 శాతానికి, 2017 నాటికి 17 శాతానికి తగ్గింది. 2011 లెక్కల ప్రకారం మహా నగరం జనాభా 74.04 లక్షలు. 2017 అంచనాల ప్రకారం 93.06 లక్షలకు, ప్రస్తుతం కోటీ పది లక్షలదాకా పెరిగినట్టు అంచనా.

మాదాపూర్‌ సైబర్‌ విల్లేలో శాశ్వత ఆధార్‌ కేంద్రం
యూఐడీఏఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయాన్ని, మొట్టమొదటి డైరెక్ట్‌ ఆధార్‌ సేవా కేంద్రాన్ని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న రిలయన్స్‌ సైబర్‌ విల్లేలో ప్రారంభించారు. ఈ కేంద్రంలో రోజూ వెయ్యి వరకు ఆధార్‌ నమోదు, అప్‌డేట్స్‌ చేస్తారని అధికారులు వెల్లడించారు. యూఐడీఏఐ వెబ్‌సైట్లో ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకుని, నిర్ధారిత తేదీ, సమయానికి కేంద్రానికి రావాలని తెలిపారు. ఇక్కడ వారంలో ఏడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు అందుతాయని పేర్కొన్నారు.  
చదవండి:  ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే.. ఇదేంటి: హైకోర్టు

మరిన్ని వార్తలు