పాల్వంచలో నిర్మాణానికి ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నివేదిక  

25 Jun, 2021 07:40 IST|Sakshi

సాక్షి, పాల్వంచ(ఖమ్మం): రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం గల భధ్రాద్రి జిల్లాలో ఎయిర్‌ పోర్ట్‌ ఏర్పాటుకు టెక్నికల్‌ సర్వే బృందం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయం ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించింది. దీంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ పారిశ్రామిక జిల్లాగా పేరుగాంచింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు పరిశ్రమలకు అనుకూలంగా ఉండటంతో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లో సింగరేణి బొగ్గు గనులు, సారపాకలో ఐటీసీ, అశ్వాపురంలో భారజల కర్మాగారం, పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, ఎన్‌ఎండీసీ, మణుగూరు – పినపాక మండలాల సరిహద్దులో బీటీపీఎస్‌ వంటి అతి పెద్ద సంస్థలకు నిలయంగా మారింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత గలదిగా పేరుగాంచింది. రామయ్య దర్శనానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇక ఆయా పరిశ్రమల్లో పనిచేసేందుకు, ఇతర అవసరాల కోసం సైతం అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే వీరందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఏప్రిల్‌ 24న టెక్నికల్‌ సర్వే..
కొత్తగూడెం–పాల్వంచ ఇప్పటికే జంట పట్ట ణాలుగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పాల్వంచ కేంద్రంగా ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు పలు దఫాలు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్‌ 999లో గల సుమారు 1000 ఎకరాల భూమిని అప్పటి కలెక్టర్‌ ఎంవి.రెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు పరిశీలించారు. అనంతరం ఏప్రిల్‌ 24న పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పిల్లవాగు, పేట చెరువు, గుడిపాడు గ్రామ సమీపాల్లో పర్యటించారు. సర్వేయర్‌ కె.కె.అరివోలి ఎఎం, సీనియర్‌ జీఐఎస్‌ అనలిస్ట్‌లు గౌరవ్‌ కుమార్‌ ఉపాధ్యాయ్, కె.అభిరామ్, ఆర్‌అండ్‌బీ ఈఈ బి.బీమ్లా, తహసీల్దార్‌ స్వామి ఆధ్వర్యంలో టెక్నికల్, డిజిటల్‌ సర్వే నిర్వహించారు. 

అనుమతులు రాగానే పనులు..
టెక్నికల్‌ సర్వే నిర్వహించిన అధికారులు విమానశ్రయం ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫేస్‌–1లో 406 ఎకరాల్లో నిర్మాణానికి రూ.483 కోట్ల నిధులు అవసరం ఉంటుందని ప్రతిపాదనలు చేశారు. అయితే ఒకేసారి ఆరు విమానశ్రయాలు నెలకొల్పడం వల్ల భారీ బడ్జెట్‌ అవుతుండటంతో పౌర విమానయాన శాఖ అంగీకారం తెలిపితే వెంటనే మరో సారి సర్వే చేపట్టి పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు టెక్నికల్‌ సర్వే బృందం ఆమోదం తెలపడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌కు 300 కి.మీ.దూరం..
ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నిబంధనల ప్రకారం శంషాబాద్‌ విమానాశ్రయానికి 240 కి.మీ.దూరం లోపులో మరో ఎయిర్‌పోర్ట్‌ నిర్మించకూడదు. కానీ హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం జిల్లా కేంద్రం 300 కి.మీ.దూరంలో ఉంటుంది. అంతేకాకుండా జిల్లాకు ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు సరిహద్దులో ఉన్నాయి. ఈ కారణాలతో కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా తాజాగా వరంగల్, ఆదిలాబాద్, బసంత్‌నగర్‌(పెద్దపల్లి), జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌), పాల్వంచ(కొత్తగూడెం), దేవరకద్ర(మహబుబ్‌ నగర్‌)లలో కొత్తగా డొమెస్టిక్‌(దేశీయ) విమానాశ్రయాలను ఫేస్‌–1, ఫేస్‌–2లో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి.   

మరిన్ని వార్తలు