ఏప్రిల్‌ 14 నుంచి ‘ఆప్‌’ నేతల పాదయాత్ర! 

19 Mar, 2022 02:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంజాబ్‌లో గెలిచి ఫుల్‌ జోష్‌ మీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తెలంగాణలోనూ కాలుమోపేందుకు సిద్ధమవుతోంది. ఆప్‌ను జాతీయ పార్టీగా మార్చేందుకు మున్ముందు జాతీయ పార్టీలకు పోటీ ఇవ్వడానికి ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలంగాణలోనూ ఏప్రిల్‌ 14 నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొని జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఆప్‌ ముఖ్యనాయకుడు, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సోమ్‌నాథ్‌ భారతి ఈ నెలాఖరులో నగరానికి రానున్నారని, పాదయాత్ర రూట్‌మ్యాప్‌నకు తుదిరూపం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్టీ రాష్ట్ర కోకన్వీనర్‌ ఇందిరాశోభన్‌తోపాటు మరికొందరు నేతలు పాదయాత్ర చేపట్టనున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర కొనసాగేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతికి సంబంధించి వీలు చిక్కినప్పుడల్లా ఎండగడుతూనే ఉన్నారు.    

మరిన్ని వార్తలు