ఆరోగ్యశ్రీ రోగులకు షాకిచ్చిన నిమ్స్‌

3 Nov, 2020 11:11 IST|Sakshi

ఆరోగ్యశ్రీ ఓపీ సేవల్లో రాయితీలలో కోత

నిమ్స్‌లో వైద్య సేవలకు 25 శాతం చెల్లించాల్సిందే..

సాక్షి, హైదరాబాద్‌‌: నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ రోగులకు ఓపీ సేవల్లో కోత విధించారు. ఇక్కడ అవుట్‌ పేషెంట్‌గా వైద్య పరీక్షలు చేయించుకుంటే 25 శాతం మేరకు ఆయా ఖర్చులను భరించాల్సిందే. సోమవారం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. ఇప్పటి వరకు ఆస్పత్రిలో 2 వేల రూపాయల వరకు రాయితీ కల్పిస్తున్నారు. ఇక మీదట ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం అర్హులైన రోగులకు వైద్య సేవలను అందించేందుకు యాజమాన్యం సమాయత్తమైంది. ఆస్పత్రి ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో ఓపీ సేవల్లో రాయితీలలో కోత విధించినట్టు సమాచారం. కోవిడ్‌–19 నేపథ్యంలో నిమ్స్‌లో కూడా ఉద్యోగులకు జీతాలను చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా నిమ్స్‌ ఆస్పత్రికి ఈ ఆరు నెలల్లో రూ. 50 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. సాధారణంగా నిమ్స్‌కు రోగుల నుంచి క్యాష్‌ కలెక్షన్స్‌ ద్వారా నెలకు రూ.8.5 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆస్పత్రికి రూ. 2.5 కోట్ల వరకే ఆదాయం లభించింది. కాగా ఆస్పత్రి ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను చక్కదిద్దేందుకు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామని నిమ్స్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. ఆస్పత్రిలో క్యాష్‌ కలెక్షన్స్‌ గణనీయంగా పడిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. దీంతో ఆరోగ్యశ్రీ ఓపీ సేవల్లో గతంలో వర్తింపచేసిన నిబంధనలనే అనుసరిస్తున్నామన్నారు.  

చదవండి: పోలీసు ఉద్యోగం.. విద్యార్థులకు శుభవార్త

మరిన్ని వార్తలు