అర్ధరాత్రి అబార్షన్‌.. ఆస్పత్రి సీజ్‌

26 Mar, 2021 15:07 IST|Sakshi
ఆస్పత్రిని సీజ్‌ చేస్తున్న డీఎంహెచ్‌ఓ, అధికారులు  

సాక్షి, వరంగల్ : అల్లోపతిక్‌ మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం నిబంధనలను ఉల్లఘించిన హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్క్‌ ఎదురుగా ఉన్న సిటీ ఆస్పత్రిని సీజ్‌  చేసినట్లు డీఎంహెచ్‌ఓ లలితాదేవి, సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటలకు తమకు అందిన సమాచారంతో ఆస్పత్రిలో తనిఖీ చేయగా అర్హులైన వైద్యులు, సిబ్బంది లేకుండా నిర్వహణ సాగుతున్నట్లు వెల్లడైందని తెలిపారు. అంతేకాకుండా ఆస్పత్రి నిర్వహకుడు అండ్రు ఇంద్రారెడ్డిపై కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

బీఎస్సీ చదివిన ఇంద్రారెడ్డి మెడికల్ రిప్రజెంటీవ్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఎంబీబీఎస్ చదివినట్లుగా అవతారమెత్తాడు. యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్లు కూడా చేసేస్తున్నాడు. అలాగే వచ్చీ రానీ వైద్యంతో అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇంద్రారెడ్డి ట్రీట్‌మెంట్‌పై అనుమానం రావడంతో వైద్యశాఖ అధికారులకు కొంతమంది సమాచారం ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఇంద్రారెడ్డి అబార్షన్ చేస్తున్నాడు. అధికారులను చూసిన ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా గోడ దూకి పారిపోయాడు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న మహిళన బాత్రూమ్‌లో దాచారు.

పోలీసుల సహాయంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చిన అధికారులు ఆమెను విచారించారు. తీవ్రరక్తస్రావం అవుతుండడంతో సదరు మహిళను హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్‌ చేశారు. ప్రస్తుతం ఇంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంద్రారెడ్డి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలోనూ ఇలాగే ఓ ఆసుపత్రి ఏర్పాటు చేయగా.. దాన్ని  అధికారులు దాన్ని సీజ్‌ చేశారు. 

చదవండి: ఉద్యోగం పేరుతో ఆశ: బాలికను లక్ష రూపాయలకు..

మరిన్ని వార్తలు