ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ..

15 Dec, 2020 21:48 IST|Sakshi

గైర్హాజరైన ఉదయ్‌సింహపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

సాక్షి,హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్ కొట్టివేయటంతో అభియోగాలపై ట్రైల్స్ ప్రారంభించింది. సండ్రా వెంకటవీరయ్యపై విచారణ ప్రారంభమైంది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయసింహపై ఏసీబీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.

ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్ల కేసును విచారణ జరిగింది. మొదటిసారి నిందితులపై అభియోగాలపై విచారణ ప్రారంభించింది. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై అభియోగాలపై చార్జస్ ప్రేమ్ చేసింది. సండ్రపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12, ఐపీసీ 120బి, రెడ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదు చేసింది. అభియోగాలను సండ్ర వెంకట వీరయ్యకు కోర్టు చదివి వివరించింది. అభియోగాలను సండ్ర వెంకటవీరయ్య అంగీకరించలేదు. ఇదే క్రమంలో సండ్రా, ఉదయసింహల డిశ్చార్జ్ పిటీషన్స్ ను గతంలో ఏసీబీ కోర్టు, హైకోర్టు కొట్టివేసింది.

ఇక ఇతర నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్‌లు కోర్టుకు హజరుకాగా గైర్హాజరైన ఉదయ్ సింహాపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. గత విచారణ లోనే నిందితులు అందరూ ఎట్టి పరిస్థితి లో హాజరుకావాలి అని సీరియస్ గా ఆదేశించింది. అయినప్పటికీ ఉదయసంహ హాజరు కాపోవటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే ఉదయసింహ, సెబాస్టియన్, సండ్రల డిశ్చార్జ్ పిటీషన్స్ కోర్టు తోసిపుచ్చడంతో త్వరలోనే ఇతర నిందితుల అందరిపై సైతం నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభించనుంది ఏసీబీ కోర్టు. ఇక ఇదే కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. ఓటుకు కోట్ల కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది. అభియోగాల నమోదుపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారులు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మరిన్ని వార్తలు