కీస‌ర త‌హ‌శీల్దార్ కేసులో విచారణ వేగవంతం

27 Aug, 2020 16:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి కేసులో మూడోరోజు ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రూ.కోటి.10 లక్షల పై రియల్టర్‌ శ్రీనాథ్‌ వివరణ ఇచ్చారు. నాగరాజుకు శ్రీనాథ్‌ సహకరించాడన్న నేపథ్యంలో ‌శ్రీనాథ్‌ను అధికారులు విచారించారు. కాగా రియల్‌ ఎస్టేట్‌కు చెందిన సత్య డెవలపర్స్‌ కోసం డబ్బులు తీసుకొచ్చినట్లు చెప్పాడు. డబ్బు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో ఏసీబీకి శ్రీనాథ్‌ తెలిపారు. నాగరాజు సహచరుడు అంజిరెడ్డి వద్ద దొరికిన ప్రజాప్రతినిధి డాక్యుమెంట్లపై ఏసీబీ వివరాలు సేకరించింది. గుండ్లపోచంపల్లిలో ఆక్రమణలకు గురైన భూముల వివరాలను.. ఆర్‌టీఐ ద్వారా సేకరించిన డాక్యుమెంట్లని అంజిరెడ్డి ఏసీబీకి తెలిపారు. రాంపల్లి దయారా గ్రామానికి సంబంధించిన రూ.54 లక్షల ఎంపీ నిధుల మంజూరు లెటర్‌హెడ్‌పై స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

మరో నాలుగు నియోజకవర్గాల పనుల కోసం నిధుల కేటాయింపుకు సిద్ధం చేసిన లెటర్‌హెడ్స్‌ అని అంజిరెడ్డి తెలిపినట్టు సమాచారం. కాగా తహశీల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు సహకరించడం లేదని, బ్యాంక్‌ లాకర్లపై నోరు మెదపడం లేదని అధికారులు తెలిపారు. బినామీ ఆస్తులపై, తాను చేసిన అక్రమాలపై ఏసీబీకి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా ఇదే కేసులో కీసర రెవెన్యూ శాఖ సిబ్బందిని ఏసీబీ ప్రశ్నించింది. నేటితో నలుగురు నిందితుల కస్టడీ ముగియనుంది. కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట ఏసీబీ హాజరుపర్చనుంది.
చదవండి: గిన్నిస్ బుక్ రికార్డులోకి కీస‌ర త‌హ‌సీల్దార్

మరిన్ని వార్తలు