ఏసీబీ వలలో శేరిలింగంపల్లి టీపీవో

22 Apr, 2022 08:08 IST|Sakshi
సిటీ ప్లానర్‌ చాంబర్‌, నర్సింహ రాములు 

ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు

కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు

ఆస్తుల లెక్కలపై మరింత సమయం పట్టే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ శేరిలింగం పల్లి సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ మెతుకు నర్సింహ రాములుపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. గురువారం ఈ కేసులో వ్యవహారంలో ముసారాంబాగ్‌తో పాటు ఆర్కేపురం, మరో రెండు చోట్ల నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందాలు సోదాలు నిర్వహించాయి.

టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా ఉన్న నర్సింహ రాములపై ఏసీబీ అనేక ఫిర్యాదులు రావడంతో ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, ఆయన కుటుంబీకులకు సంబంధించి వారిపై నిఘా పెట్టిన ఏసీబీ కీలక డాక్యుమెంట్లను సేకరించింది. దీనితో ఆదాయానికి మించి ఆస్తులు కల్గి ఉన్నట్లు ధృవీకరించుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసినట్టు తెలిపింది. నివాసాలు, కార్యాలయాల్లో పలు భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, బినామీ పేరిట కొనుగోలు చేసిన భూములు, బంగారం, నగదును స్వాధీ నం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలను శుక్రవారం వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.  

చాంబర్‌ సీజ్‌.. 
శేరిలింగంపల్లి సర్కిల్‌ టీపీవో ఎం.నర్సింహ రాములు చాంబర్‌ను ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. గురువారం ఉదయం బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి టీపీవో చాంబర్‌ ఎక్కడ అని అడిగి తెలుసుకున్నాడు. అప్పటికే తెరిచి ఉన్న చాంబర్‌ను డోర్‌ లాక్‌ వేసి సీజ్‌ చేశారు. చాంబర్‌లో ముఖ్యమైన ఫైళ్లు ఉన్నాయని, ఎవరు తెరవరాదని సెక్యూరిటీతో చెప్పి వెళ్లారు. లాక్‌పై వేసిన సీల్‌పై సీబీ డీఎస్‌పీ డాక్టర్‌ శ్రీనివాస్‌ పేరుతో పాటు ఫోన్‌ నెంబర్‌ రాసి వెళ్లారు. కాగా సిటీ ప్లానర్‌ నర్సింహ రాములు షిరిడీ యాత్రలో ఉన్నట్లు సమాచారం.  

ఉలిక్కిపడ్డ అధికారులు  
ఏసీబీ అధికారులు సిటీ ప్లానర్‌ చాంబర్‌ను సీజ్‌ చేయడంతో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఆందోళనకు లోనయ్యారు. రెండో అంతస్తులో ఉన్న జోనల్‌ టౌన్‌ ప్లానింగ్‌లో పనిచేసే ఏసీపీలు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పత్తా లేకుండా పోయారు. అకౌంట్స్‌ సెక్షన్‌తో పాటు మొదటి అంతస్తులో ఉన్న శేరిలింగంపల్లి సర్కిల్‌–21 టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోను ఎవరు ఆఫీస్‌కు రాలేదు. వెస్ట్‌జోనల్‌ కమిషనర్‌ ప్రియాంక అల సమీక్షా సమావేశాన్ని చందానగర్‌ సర్కిల్‌లో నిర్వహించడం గమనార్హం. అటు మూసారాంబాగ్‌లోని నివాసంలో మరో డీఎస్పీ ఫయాజ్‌ సయ్యద్‌ నేతృత్వంలో అధికారుల బృందం సాయంత్రం వరకు సోదాలు నిర్వహించింది. 

మరిన్ని వార్తలు