మహానాడు వేదికగా.. ఓటుకు కోట్లు కుట్ర

24 Oct, 2020 04:58 IST|Sakshi

రేవంత్‌ తదితరులతో కలసి సండ్ర కుట్ర చేశారు 

ఈ కేసు నిరూపించేందుకు అన్ని ఆధారాలున్నాయి

కౌంటర్‌ దాఖలు చేసిన ఏసీబీ.. 27కి విచారణ వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను డబ్బు తో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. తనను ఈ కేసులో అక్రమంగా ఇరి కించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్‌ పిటిషన్లపై ఏసీబీ ఇటీవల కౌంట ర్‌ దాఖలు చేసింది. సండ్ర వాదనను ఏసీబీ తోసిపుచ్చింది. రేవంత్‌రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా ఈ కుట్రలో భాగస్వామిగా మారారని పేర్కొంది.

శంషాబాద్‌ నోవాటెల్‌లో ఇదే అంశంపై రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని తెలిపింది. అలాగే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్‌ కాల్స్, వాయిస్‌ కాల్స్‌లోనూ సండ్ర ప్రమే యం స్పష్టంగా ఉన్నాయంది. సండ్ర పాత్రపై ఆధారాలున్న నేపథ్యంలోనే.. 2015, జూలై 6న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, తర్వాత అన్ని ఆధారాలతో 2017, ఫిబ్రవరి 18న అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేశామని వివరించింది. ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు తర్వాత దాఖలు చేసిన చార్జి షీట్‌లో ఆయన్ను చేర్చలేదని, తర్వాత లభించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా సండ్ర పాత్రపై అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేశామని పేర్కొంది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని వివరించింది.  

డబ్బు తెచ్చింది ఉదయసింహనే... 
రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌.. సీఫ్టెన్‌సన్‌ను ప్రలోభపెట్టారని ఏసీబీ వివరించింది. స్టీఫెన్‌సన్‌కు అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇచ్చేం దుకు టీడీపీ ఎమ్మెల్యేలు బస చేసిన శంషాబాద్‌ నోవాటెల్‌ నుంచి మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో రేవంత్‌రెడ్డి బయలు దేరారని తెలిపింది. స్టీఫెన్‌సన్‌ సూచించిన అపార్ట్‌మెంట్‌కు 2015, మే 31న మధ్యాహ్నం 4.40 గంటల ప్రాంతంలో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌ ఒకే కారు (మహీంద్రా స్కార్పియో–ఏపీ 09 సీవీ 9939) లో వచ్చారని వెల్లడించింది. వారు వచ్చిన కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారు (టీఎస్‌10యుఏ 1031)లో రూ.50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్‌మెంట్‌కు వచ్చారని ఏసీబీ వివరించింది.

తెచ్చిన డబ్బును సంచిలో నుంచి తీసి టీపాయ్‌పై పెట్టింది కూడా ఉదయసింహనే అని తెలిపింది. ఈ సమయంలో వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలని మరోసారి రేవంత్‌రెడ్డి.. స్టీఫెన్‌సన్‌ను కోరారని, మిగిలిన రూ.4. 5 కోట్లను ఓటింగ్‌ తర్వాత ఇస్తామని వాగ్ధానం చేశారని పేర్కొంది. ‘డబ్బు ఎక్కడి నుంచి తేవా లని చెప్పేందుకు నాగోలు చౌరస్తాకు రమ్మని ఉదయసింహకు రేవంత్‌రెడ్డి సూచించారు. మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి వేం కృష్ణకీర్తన్‌ రెడ్డి నుంచి సీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు రూ.50 లక్షలను తీసుకురావాలని రేవంత్‌రెడ్డి.. ఉదయసింహకు చెప్పారు. ఈ కేసులో ఉదయసింహ పాత్ర ను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నా యి. ఓటుకు కోట్లు కేసు నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరి డిశ్చార్జ్‌ పిటిషన్లను కొట్టివేయాలి’అని ఏసీబీ నివేదించింది. ఇదిలా ఉండగా, ఈ కేసు విచారణలో భాగం గా శుక్రవారం రేవంత్‌రెడ్డి, సండ్ర తదితరులు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరగా న్యాయమూర్తి అనుమతించారు. తదుపరి విచా రణను ఈనెల 27కి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు