ఆ కార్లు ఎక్కడివి?

3 Feb, 2024 04:59 IST|Sakshi

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ  

రెరా కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: ఆ కార్లు ఎక్కడివి..ఎవరు బహుమతిగా ఇచ్చారు? ఒకవేళ మీరే కొంటే..అందుకు సొమ్ము ఎక్కడిది? అంటూ మూడో రోజు కస్టడీలో ఏసీబీ అధికారులు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణను ప్రశ్నించినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడడానికి కొద్ది నెలల కిత్రమే రెండు కొత్త కార్లు శివబాలకృష్ణకు బహుమతిగా వచ్చినట్టు ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఇందులో హోండాసిటీ కారును ఓ బిల్డర్, నెక్సాన్‌ కారు ఓ రియల్‌బ్రోకర్‌ నుంచి బహుమతిగా వచ్చినట్టుగా ప్రాథమిక ఆధారాల మేరకు అనుమానిస్తున్నారు. ఈ రెండు కార్ల విషయంతోపాటు కుటుంబసభ్యులు, ఇతర బినామీల పేరిట నడుపుతున్న పలు బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలపైనా ఏసీ బీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.

శివ బాలకృష్ణ భార్య బంధువు భరత్‌ పేరిట మరో మూడు లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా శుక్రవారం మూడో రోజు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. తొలిరోజు విచారణలో భాగంగా బుధవారం ఏడు గంటలు, గురువారం ఆరుగంటలపాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారుల బృందం ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం విచారణలో భాగంగా ఉద యం చంచల్‌గూడ జైలు నుంచి శివబాలకృష్ణను తమ కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు తొలుత రెరా కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం.

అక్కడ సోదా ల్లో రూ.కోటి విలువైన ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నించారు. అయితే తొలి రెండు రోజులు ఏసీబీ విచారణకు సహకరించకపోయినా, వరుసగా కీలక పత్రాలు ముందుంచి తమదైన శైలిలో ప్రశి్నస్తుండడంతో శివబాలకృష్ణ కొన్ని ప్రశ్నలకు ఏసీబీ అధికారులకు సమాధానాలు ఇస్తున్నట్టు తెలిసింది.  

లాకర్లలో భారీగా బంగారం?  
శివబాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యుల పేరిట ఉన్న బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరిపించినట్టు సమాచారం. ఈ లాకర్లలో పెద్ద మొత్తంలో దాచిన బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఎంతమేర బంగారం, ఇతర పత్రాలు స్వా«దీనం చేసుకున్నారన్న సమాచారం పూర్తిగా తెలియరాలేదు. కాగా, ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత శివబాలకృష్ణపై మరికొందరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తుండడంతో ఏసీబీ అధికారులు ఆ అంశాలపైనా ఫోకస్‌ పెట్టినట్టు తెలిసింది. శనివారం మరోమారు ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీకి తీసుకొని ప్రశ్నించనున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు