MLA Jeevan Reddy: ఆ కారణం వల్లే ప్లాన్‌ ప్రకారం జీవన్‌రెడ్డికి పిస్టల్‌ గురిపెట్టి

9 Aug, 2022 01:17 IST|Sakshi

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు.. 

కల్లెడ గ్రామ మాజీ సర్పంచ్‌ భర్త ప్రసాద్‌ సూత్రధారి 

ఇతడికి సహకరించిన ఐదుగురు నిందితులు పరారీలో 

వివరాలు వెల్లడించిన పశ్చిమ మండల డీసీపీ జోయల్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ భర్త పెద్దగాని ప్రసాద్‌గౌడ్‌ను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డెవిస్‌ సోమవారం ప్రకటించారు. టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

బిల్లులు ఆగాయని హత్యకు పథకం.. 
కొన్నాళ్లుగా జీవన్‌రెడ్డి, ప్రసాద్‌గౌడ్‌కు స్పర్థలున్నా యి. తన భార్య కల్లెడ సర్పంచ్‌గా ఉండగా ప్రసాద్‌ ఆ గ్రామంలో రూ.20 లక్షల విలువైన కాంట్రాక్టులు చేశాడు. ఈ పనుల్లో అవకతవ కలు జరిగినట్లు మాక్లూర్‌ ఎంపీఓ నివేదిక రూపొందించారు. దీంతో కలెక్టర్‌ కల్లెడ సర్పంచ్‌ను సస్పెండ్‌ చేశారు. ప్రసాద్‌కు రావాల్సిన బిల్లులు ఆగిపోయాయి. విచక్షణ కోల్పోయిన ప్రసాద్‌ ఎంపీఓపై దాడి చేయడంతో మాక్లూర్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. తనతో ఉన్న విభేదాలతో జీవన్‌రెడ్డే ఇవన్నీ చేయిస్తున్నాడని భావించిన ప్రసాద్‌.. హత్యకు పథకం వేశాడు. గత ఏప్రిల్‌లో నాందేడ్‌లో కత్తి, జూన్‌లో సంతోష్‌ సహకారంతో నగరంలోని నాంపల్లిలో ఎయిర్‌పిస్టల్, పిల్లెట్స్‌ కొన్నాడు. నేరుగా జీవన్‌రెడ్డి ఇంటికెళ్లినా ఆయన లేకపోవడంతో కొద్దిసేపు రెక్కీచేసి ఊరికి వెళ్లిపోయాడు.  

తలకు ఎయిర్‌పిస్టల్‌ గురిపెట్టి.. 
జూలై మొదటి వారంలో నిజామాబాద్‌కు చెందిన సుగుణ ద్వారా బాల్కొండకు చెందిన సురేందర్‌ ప్రసాద్‌కు పరిచయమయ్యాడు. రూ.60 వేలు తీసుకున్న సురేందర్‌.. బిహార్‌లోని మున్నాకుమార్‌ ద్వారా నాటుపిస్టల్‌ తెప్పించి, ప్రసాద్‌కిచ్చాడు. తూటాల కోసం దమ్మాయ సాగర్‌తో కలిసి ప్రయత్నించినా దొరకలేదు. దీంతో నాంపల్లిలోని ఆర్మరీకి వెళ్లిన తూటాలు కావాలని అడి గినా వారు ఇవ్వలేదు. ఈ క్రమంలో ఈనెల 1న రాత్రి ప్రసాద్‌ బంజారాహిల్స్‌లోని జీవన్‌రెడ్డి ఇంటికెళ్లాడు. నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఆయన తలకు ఎయిర్‌పిస్టల్‌ గురిపెట్టాడు.

ఎమ్మెల్యే కేకలు వేయడం.. గన్‌మెన్లు అప్రమత్తం కావడంతో ప్రసాద్‌ పారిపోయాడు. జీవన్‌రెడ్డి ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు కేసునమోదు చేశారు. ఆదివారం రాత్రి ప్రసాద్‌ను పట్టుకుని.. కారు, ఎయిర్‌ పిస్టల్స్, పిల్లెట్స్, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై ఇప్పటికే 5 క్రిమినల్‌ కేసులున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సుగుణ, సంతోష్‌, మున్నాకుమార్, సురేందర్, దమ్మాయ సాగర్‌ కోసం గాలిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న గన్‌మెన్‌లపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని, ప్రసాద్‌ భార్య పాత్రపై ఆధారాల్లేవని డీసీపీ తెలిపారు.  

ఇది కూడా చదవండి: ‘నేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్సే నేను’.. ఆసక్తికరంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు