సొంత శాఖలో అక్రమార్కులపై పోలీసు కథాస్త్రం!

4 Dec, 2020 10:51 IST|Sakshi

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వైనం

కొందరు అధికారుల వ్యవహారంపై కుండబద్దలు కొట్టిన ఏసీపీ

బహిరంగంగానే అవినీతి వివరాలు వెల్లడి

విచారణకు రంగంలోకి దిగిన  నిఘా వర్గాలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని కొందరు పోలీసు అధికారుల తీరు చర్చనీయాంశమవుతోంది. కమిషనర్‌గా పి.ప్రమోద్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో అవినీతి, అక్రమాలు, భూదందాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడిన పలువురు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఇతర సిబ్బందిపై కొరడా ఝుళిపించారు. సస్పెన్షన్లు, బదిలీలు, విచారణలు, చార్జ్‌ మెమోలు జారీ చేశారు. దీంతో పలువురు బాధితులు నేరుగా సీపీని కలిసి ‘సెటిల్‌మెంట్‌’ అధికారులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే సమయంలో కొందరు అధికారులు సైతం అవినీతి, అక్రమాలపై కవితలు, కథానికలు రాస్తున్నారు. అవి కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి శాఖలో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ ఏసీపీ స్థాయి అధికారి ‘యదార్థవాది... లోక విరోధి’ అంటూ సంధించిన అస్త్రం ఇప్పుడు కమిషనరేట్‌ పరిధిలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

అదేమిటంటే...
వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ జిల్లాల పోలీసు అధికారులతో కూడిన గ్రూపులో ఓ ఏసీపీ స్థాయి అధికారి పెట్టిన పోస్టింగ్‌ కలకలం రేపుతోంది. ఓ ఏసీపీ, నలుగురు ఇన్‌స్పెక్టర్ల తీరుపై ఆ పోస్టింగ్‌లో ధ్వజమెత్తగా, ఎవరా ఐదుగురు అనే చర్చ మొదలైంది. ‘ఈ మధ్య నేను ఒక వింత అనుభవాన్ని చవిచూశాను, అదేమిటంటే! ఓ పని మీద ఒక ఏసీపీ ఆఫీస్‌కు వెళ్లాను. డిస్పోజల్‌ కప్‌లో టీ ఇవ్వగా తాగాను. సంతోషం.. అంతలోనే ఏసీపీ గన్‌మెన్‌ వచ్చి  ‘సర్‌ ‘ఆ’ గారు వచ్చారు! అనగానే వెంటనే నాతో సెలవు అన్నా అంటూ!(పొమ్మనకనే పొమ్మంటూ) పంపించారు.

భూకబ్జాలు, భూచీటింగ్‌కు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు ఉండి ఎన్నోసార్లు జైలుకు వెళ్లిన సదరు  ‘ఆ’ను ఏసీపీ సాదరంగా ఆహ్వానిస్తూ టీ కప్‌లు శుభ్రంగా కడిగి టీ తెమ్మని సిబ్బందిని ఆదేశించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సామాన్య ఫిర్యాదుదారులకు ఎందుకు ఇంత మర్యాద ఇవ్వరని ఆలోచించాను’ అంటూ ఆ పోస్టింగ్‌లో సదరు పోలీసు అధికారిపై ధ్వజమెత్తారు. ‘ఈ మధ్య మరో ఘటన జరిగింది, ఇరువైపులా భూకేసులు ఉన్న వారిని మభ్యపెడుతూ భూమి మీదంటే మీదని వారి వద్ద రూ.లక్షలు లక్షలు తీసుకుని ఇంకా డబ్బు కోసం ఫోన్‌లో మాట్లాడిన సంఘటన ఆడియో ఒక గ్రూప్‌లో లీకైంది, ఇది వరంగల్‌ సిటీలో ఒక సీఐ తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఆయన పేరు మాత్రం పవిత్రమైన దైవగ్రంథంలోని పేరు, ఆయన చేసేవి మాత్రం సైతాను క్రియలు, అది దేవుడికే అవమానం, అలాగే అలాంటి భూముల ఓనర్లు, పెట్టుబడి పెట్టే ఒక రియల్టర్‌తో సంబంధాలు ఉన్న ముగ్గురు ఎస్‌హెచ్‌ఓ / సీఐలు సదరు రియల్టర్‌ కాల్‌ డేటా తీస్తే ఎలా అని గజగజ వణుకుతున్నారు. రకరకాల పలుకుబడితో వివిధ స్థాయిల్లోని అధికారులు, నాయకులతో ఫోన్లు చేయిస్తున్నారు’ అంటూ పేర్కొన్నారు. ఇంతకీ ఆ ఏసీపీ, ఆ నలుగురు ఇన్‌స్పెక్టర్లు ఎవరనే చర్చ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. 

రంగంలోకి ఇంటిలిజెన్స్, ఎస్‌బీ
అధికారిక గ్రూపులో ఓ పోలీసు అధికారి అదే శాఖకు చెందిన కొందరిపై చేసిన ఆరోపణలపై ఆరా తీసేందుకు ఇంటలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఇంతకీ ఆ ఏసీపీ, ఆ నలుగురు ఇన్‌స్పెక్టర్లు ఎవరు, ఏసీపీ దగ్గరకు వచ్చిన భూవివాదాలు, కబ్జాలకు పాల్పడి, పదుల సంఖ్యలో కేసులున్న ఆ ‘ఆ’ అనే వ్యక్తి ఎవరని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసు అధికారిక గ్రూపులో వచ్చిన పోస్టింగ్, ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై సమగ్ర నివేదిక తయారీకి సిద్ధమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆ ‘ఆ’ అనే తెలుగుదేశం హయాంలో హౌజింగ్‌ స్కామ్‌తో పాటు పలు అక్రమ మార్గాల్లో రూ.కోట్లు వెనకేసుకున్న ఓ రాజకీయ నాయకుడని తెలిసింది. టీడీపీ హయాంలో హవా నడిపించిన సదరు నేతకు పోలీసు అధికారి పెద్దపీట వేయడంపై చర్చ సాగుతోంది. ఏది ఏమైనా నలుగురు ఇన్‌స్పెక్టర్ల వ్యవహారంపై నిఘావర్గాలు ఆరా తీస్తుండటం పోలీసుశాఖలో కలకలం రేపుతోంది.

మరిన్ని వార్తలు