బదిలీ.. దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తా

10 Oct, 2021 00:58 IST|Sakshi
జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచందర్‌రావుకు జ్ఞాపికను బహూకరిస్తున్న జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి   

తొమ్మిదేళ్లుగా పని ఒత్తిడితో తీరిక లేకుండా గడిపా 

కష్టపడితేనే విజయం.. సక్సెస్‌కు షార్ట్‌కట్లు ఉండవు 

వీడ్కోలు సభలో తాత్కాలిక సీజే జస్టిస్‌ రామచందర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ‘తొమ్మిదేళ్లకుపైగా ఉమ్మడి హైకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా తీవ్ర పని ఒత్తిడితో తీరిక లేకుండా గడిపా. ఆరోగ్యం మీద ప్రభావం చూపించడంతోపాటు భార్యాపిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయా. పంజాబ్‌–హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నన్ను బదిలీ చేయడం.. కుటుంబంతో తీరికగా గడిపేందుకు దేవుడిచ్చిన అవకాశంగా భావిస్తా’అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు పేర్కొన్నారు.

యువ న్యాయవాదులకు కష్టపడితేనే విజయం సాధ్యమని, సక్సెస్‌కు షార్ట్‌కట్లు ఉండవని పేర్కొన్నా రు. ఇక్కడ పనిచేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు జస్టిస్‌ రామచందర్‌రావుకు శనివారం ఆన్‌లైన్‌లో ఘనంగా వీడ్కోలు పలికింది. ‘1990లో కేంబ్రిడ్జిలో ఎల్‌ఎల్‌ఎం కోసం లండన్‌కు వెళ్లా. భారత్‌కు వచ్చేటప్పుటికి నా ఆలోచన విధానం, ప్రవర్తన, నిబద్దత పూర్తిగా మారిపోయాయి. న్యాయవ్యవస్థలో విభజించు.. పాలించు విధానం, రాజకీయాలు సరికాదు.

బార్‌లో కులం, ప్రాంతీయ వివక్ష చూపించరాదు. బార్‌ అసోసియేషన్‌ అంతర్గత విభేధాలను పక్కనపెట్టాలి. సమష్టిగా ఉండాలి’అని జస్టిస్‌ రామచందర్‌రావు పేర్కొన్నారు. జస్టిస్‌ రామచందర్‌రావు నుంచి ఎంతో నేర్చుకున్నానని, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఆయనతో తనకు ఎంతో అను బంధం ఉందని జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బదిలీ ఇక్కడి న్యాయవ్యవస్థకు లోటని పేర్కొన్నారు. న్యాయమూర్తిగా నిక్కచ్చిగా తీర్పులిచ్చేవారని, ఆయన తీర్పులు కొత్తతరం న్యాయవాదులకు స్ఫూర్తిదాయకమని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌ జనరల్‌ అనుపమ చక్రవర్తి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, పీపీ ప్రతాప్‌రెడ్డి, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు, లీగల్‌ సర్వీస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి వై.రేణుక, జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ తిరుమల దేవి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు