ఉమామహేశ్వరికి ప్రముఖుల నివాళి

3 Aug, 2022 02:28 IST|Sakshi
నివాళులర్పిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు 

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి భౌతికకాయానికి మంగళవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 9లోని ఆమె నివాసంలో బంధుమిత్రులు, పలువురు ప్రము­ఖులు నివాళులర్పించారు. మంత్రి ఎర్రబెల్లి దయాక­ర్‌రావుతో పాటు ఉమామహేశ్వరి సోదరీ­మణులు గారపాటి లోకేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర­రావు, నందమూరి బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర, రామకృష్ణ, నందమూరి కల్యాణ్‌ రామ్‌ తదితరులు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు గారి కుటుంబంతో తనకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు.  ఉమామహేశ్వరి మృతిపై సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. అమెరికా నుంచి పెద్ద కుమార్తె విశాల అర్ధరాత్రి ఇక్కడికి చేరుకున్నారు. బుధవారం ఉదయం ఉమామహేశ్వరి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం
ఎన్టీఆర్‌ కుమార్తె ఉమామహేశ్వరి కొంతకాలంగా అనారోగ్యం, తీవ్ర మానసిక ఒత్తిడి, ఒంటరితనంతో బాధపడుతున్నారు. మానసిక ఒత్తిడికి సంబంధించి వైద్యం కూడా చేయించుకుంటున్నారు. అయితే ఒంటరితనం ఆమెను తీవ్రంగా బాధిస్తున్న­ట్లు గతంలో జరిగిన రెండు సంఘటనలు వెల్లడిస్తున్నాయి. మూడు నెలల కాలంలో ఆమె రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం.

ఒకసారి 40 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సకాలంలో కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి చేర్చగా ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత కొద్ది రోజులకే మరోసారి నిద్రమాత్రలు మింగారు. ఆ సమయంలో కూడా కుటుంబ సభ్యులు గుర్తించడంతో చికిత్స అనంతరం ఆమె బయటపడ్డారు. చిన్న కూతురు దీక్షిత పెళ్లి జరిగిన అనంతరం ఉమామహేశ్వరి మరింత ఒంటరితనానికి గురైనట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు