ఊపిరి ఆడట్లేదు!

19 Oct, 2020 02:25 IST|Sakshi

రాష్ట్రంలో 2.02 లక్షల మందికి తీవ్ర శ్వాసకోశ వ్యాధులు

చలికాలంలో మరింత ముప్పు

వీరికి కరోనా ప్రమాదమూ ఎక్కువే

ఇక రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి సాధారణ జ్వరాలు

వర్షాలు తగ్గడంతో వ్యాధులు విజృంభించే చాన్స్‌

ఈ ఏడాది ఇప్పటివరకు 1,712 డెంగీ కేసులు, 694 మలేరియా కేసులు నమోదయ్యాయి. అలాగే 252 చికున్‌గున్యా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. న్యుమోనియా కేసులు 1,239, స్వైన్‌ఫ్లూ కేసులు 550 నమోదయ్యాయి. టైఫాయిడ్‌ జ్వరాలు వచ్చినవారు 8,206 ఉన్నారు. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో 4,230 కేసులు నమోదు కావడం ఆందోళనకరం. ఇవిగాక ఈ ఏడాది ఇప్పటివరకు 1,14,167 డయేరియా కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో అత్యధికంగా 13,483 డయేరియా కేసులు వచ్చాయి. హైదరాబాద్‌లో వరదలు వచ్చినందున డయేరియా కేసులు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని వైద్యాధికారులు భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11,599 కేసులు, ఖమ్మంలో 6,365 కేసులు నమోదయ్యాయి. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 2,02,001 మందికి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీరు సరిగా ఊపిరి తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలున్న వారికి కరోనా ప్రమాదం కూడా ఎక్కువే. పైగా ఇప్పుడు చలికాలం ప్రారంభం కానుంది. ఈ కాలంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు నమోదైన తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 49,182 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 13,851, భూపాలపల్లి జిల్లాలో 13,602, ఆదిలాబాద్‌లో 11,817, నిజామాబాద్‌ జిల్లాలో 10,553 కేసులు నమోదయ్యాయి. 

లక్ష మందికి జ్వరాలు...
తీవ్రమైన వర్షాలు కురిసి ఆగిపోవడంతో జ్వరం, అంటువ్యాధులు ప్రబలే పరిస్థితి నెలకొంది. కరోనాతో పాటు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు కలిసి వచ్చే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,02,452 జ్వరం కేసులు నమోదయ్యాయి. వీటిని కారణాలు గుర్తించని జ్వరాలుగా పేర్కొంది. ఇక కరోనా అనుమానంతో వచ్చిన జ్వరం కేసులు 45,102 ఉంటాయని అంచనా వేశారు. మొత్తంగా చూసుకుంటే సాధారణ జ్వరాలు, కరోనా పాజిటివ్‌ వచ్చినవారిలో జ్వరాలు, నిర్దారణ పరీక్షల సందర్భంగా నెగెటివ్‌ వచ్చినవారికి జ్వరాలను కలుపుకుంటే దాదాపు 2 లక్షల జ్వరం కేసులు నమోదై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఒక్క నెలలోనే 15,201 జ్వరం కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇలా చేస్తే సరి...
ఇన్‌ఫ్లూయెంజా టీకాలు వేయించుకోవాలి
శీతాకాలం సమీపిస్తున్నందున ఫ్లూ కేసులు పెరుగుతాయి. కోవిడ్‌తో కలిపి ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 
కోవిడ్‌ ఉన్నవారికి ఇతర అంటు వ్యాధులూ వస్తాయి. మైకోప్లాస్మా న్యుమోనియా, ప్యుడోమోనాస్‌ ఏరో జినోసా, హిమోఫిలస్‌ ఇన్‌ఫ్లూ యెంజా, క్లేబ్సిఎల్లా న్యుమోనియా వంటివి సాధారణంగా వచ్చే వ్యాధులు.
డెంగీ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధులకు వైద్యం చేయడంతోపాటు కోవిడ్‌ కేసులను పర్యవేక్షణను అవసరమైన వైద్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. 
భౌతికదూరం, చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్క్‌లు తప్పనిసరి. 
డెంగీ, మలేరియా, చికున్‌గున్యాలను నియంత్రించడానికి దోమల నిర్మూలన చర్యలు చేపట్టాలి. 
కాలానుగుణ ఇన్‌ఫ్లూయెంజా టీకాలు వేయడంలో వేగం పెంచాలి. 

మరిన్ని వార్తలు