Addagudur Lockup Death: సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

25 Jun, 2021 19:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాకప్‌డెత్‌పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అవసరమైతే ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా... మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు.. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అదేవిధంగా మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని ఆదేశించారు.

కాగా యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో దెబ్బలు తాళలేక మరియమ్మ అనే మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే. ఖమ్మం జిల్లా ముకుందాపురం గ్రామానికి చెందిన మరియ (40) తన కుమారుడు ఉదయ్‌తో కలసి రెండు నెలల నుంచి వంట మనిషిగా పని చేసేవారు. ఈ క్రమంలో ఈ నెల 15న ఆమె పనిచేస్తున్న యజమాని ఇంట్లో సుమారు రూ.2 లక్షలు చోరీకి గురికాగా.. ఆయన అడ్డగూడూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

విచారణలో భాగంగా తల్లి, కుమారుడిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టగా, దెబ్బలకు తాళలేక మరియమ్మ స్పృహ తప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం  మండలంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోవడంతో, అక్కడి నుంచి వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి ఆమె మృతి చెందారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

చదవండి: ‘మరియమ్మ కుటుంబానికి రూ.5కోట్ల పరిహారం ఇవ్వాలి’

>
మరిన్ని వార్తలు