ఫీజు విషయంలోనే వివాదం.. ముందుగానే పెట్రోల్‌ బాటిల్‌తో: అడిషనల్‌ డీసీపీ

19 Aug, 2022 16:33 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రామాంతాపూర్‌ నారాయణ కాలేజీలో జరిగిన ఘటనపై అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి స్పందించారు. విద్యార్థి నాయకుడు సందీప్‌ పెట్రోల్‌ బాటిల్‌తో కాలేజీకి వచ్చినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌పై పోసేందుకే పెట్రోల్‌ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. సాయి ఫీజు, టీసీ విషయంలో నారాయణ అనే విద్యార్థికి ప్రిన్సిపాల్‌తో వివాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకొని  పరిశీలిస్తున్నామన్నారు.

‘విద్యార్థి సాయి నారాయణ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పూర్తి చేసుకున్నాడు. సాయి తన తండ్రి, విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌తో కలిసి కాలేజ్‌కు వచ్చాడు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ. 16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ సుధాకర్ చెప్పాడు.  ఈ క్రమంలో విద్యార్థి నేత నారాయణ , ప్రిన్సిపాల్‌ మధ్య వాగ్వాదం తలెత్తింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్  సుధాకర్ రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థి నేత సందీప్‌ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 

సందీప్‌ వెనకాల దీపం ఉండటంతో క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. సందీప్‌ను అడ్డుకునే క్రమంలో ఏవో అశోక్ రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్‌కు గాయాలయ్యాయి.  కాలేజీ సిబ్బందికి కూడా మంటలు అంటుకున్నాయి. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి నుంచి ఇద్దరిని యశోద ఆసుపత్రి పోలీసులు తరలించారు. విద్యార్థినేత సందీప్‌ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది’ అని అడిషనల్‌ డీసీపీ తెలిపారు.
చదవండి: నారాయణ కాలేజీ వద్ద టెన్షన్‌.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మరిన్ని వార్తలు