యువతి కిడ్నాప్‌ కేసు.. నవీన్‌రెడ్డి రిమాండ్‌కు తరలింపు

14 Dec, 2022 21:26 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. మొబైల్‌ లోకేషన్‌ ఆధారంగా  గోవాలోని బీచ్‌లో అరెస్ట్‌ చేసిన ఆదిభట్ల పోలీసులు బుధవారం హైదరాబాద్‌కు తరలించారు. సరూర్‌ నగర్‌ ఓస్‌ఓటీ కార్యాలయంలో నవీన్‌ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. కిడ్నాప్‌ జరిగిన డిసెంబర్‌9న వైశాలిని మన్నెగూడలో వదిలిన నవీన్‌ రెడ్డి గోవా పారిపోయాడు.

నవీన్‌రెడ్డిపై వరంగల్‌, హైదరాబాద్‌, విశాఖలో కేసులు నమోదయినట్లు సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. వైశాలిని కిడ్నాప్‌ చేసినట్లు నవీన్‌రెడ్డి ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో నవీన్‌రెడ్డిన రిమాండ్‌కు తరలించాం. నవీన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్‌ చేశాం. పరారీలో ఉన్న రూమన్‌, పవన్‌ల కోసం గాలిస్తున్నామని సీపీ పేర్కొన్నారు.

కాగా నవీన్‌ రెడ్డి వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలలుగా నిందితుడికి వైశాలి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వైశాలికి దగ్గరయ్యేందుకు నవీన్‌ రెడ్డి తన స్నేహితుల సాయం తీసుకున్నట్లు వెల్లడైంది. వైశాలి కదలికలను సంధ్య అనే యువతి ద్వారా తెలుసుకుని ఆమెను వెంటబడ్డాడు. వీళ్లిద్దరిని కలిపేందుకు సంధ్య పలుమార్లు యత్నించింది. నవీన్‌తో గొడవ తర్వాత మాట్లాడేందుకు వైశాలి ఇష్టపడలేదు. యువతి మధ్యవర్తిత్వం పనిచేయకపోవడంతో వైశాలి ఇంటి వద్ద షెడ్‌ ఏర్పాటు చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు.
చదవండి: యువతి కిడ్నాప్‌ కేసు.. రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

మరిన్ని వార్తలు