మూడు రోజులుగా పురుగుల అన్నమే.. 43 మంది విద్యార్థినులకు అస్వస్థత 

2 Aug, 2022 03:04 IST|Sakshi
సెలైన్‌ స్టాండ్‌లు లేకపోవడంతో చేతులతో పట్టుకున్న విద్యార్థినుల బంధువులు  

బేల కేజీబీవీలో ఘటన

ఆదిలాబాద్‌టౌన్‌/బేల: ఆదిలాబాద్‌ జిల్లా బేల కేజీబీవీలో సోమవారం 43 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆదివారం మధ్యాహ్నం చికెన్‌ అన్నం, రాత్రి ఉల్లిగడ్డ కూరతో భోజనం పెట్టినట్టు విద్యార్థినులు తెలిపారు. అయితే మధ్యాహ్నం, రాత్రి వడ్డించిన పురుగుల అన్నంతోనే అస్వస్థతకు గురైనట్లు వారు పేర్కొన్నారు. పాఠశాలలో ఆదివారం ఏఎన్‌ఎం తప్ప ఇతర సిబ్బంది లేరు.

సోమవారం ఉదయం వరకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఏఎన్‌ఎం, వాచ్‌మన్‌ కలిసి మొదట అస్వస్థతకు గురైన 28 మందిని బేల పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. మరో 15 మందికి పాఠశాలలోనే పీహెచ్‌సీ వైద్యాధికారి క్రాంతి వైద్య సేవలందించారు. సెలైన్‌ స్టాండ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులే వాటిని చేతుల్లో పట్టుకుని గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.

తీరా సాక్షి ఫొటో తీశాకా అక్కడి సిబ్బంది హుటాహుటిన స్టాండ్‌లు తీసుకువచ్చి ఏర్పాటు చేయడం విశేషం. పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మరికొందరు తల్లిదండ్రులు రిమ్స్‌కు చేరుకున్నారు. అలాగే ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థినులను పరామర్శించారు. కాగా, మూడ్రోజులుగా పురుగుల అన్నమే పెడుతున్నారని విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు.

దీంతో డీఈవో ప్రణీత పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. ఉదయం ఏఎన్‌ఎం కావాలనే విద్యార్థులను టిఫిన్‌ తినకుండా అడ్డుకోవడంతో వారు నిరసించి, అస్వస్థతకు గురయ్యారని పాఠశాల ప్రత్యేక అధికారి గేడాం నవీన పేర్కొనడం గమనార్హం. ఘటనపై ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ వేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, అడిషనల్‌ డీఆర్డీఏ రాథోడ్‌ రవీందర్, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌.. పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. 13 క్వింటాళ్ల స్టాకు బియ్యంలో 3 క్వింటాళ్లలో పురుగులు ఉండటాన్ని గుర్తించారు. గుర్తించిన లోటుపాట్లపై కలెక్టర్‌కు నివేదిస్తామని వారు తెలిపారు. 

మరిన్ని వార్తలు