మాల వేసుకున్నారని తరగతిలోకి రానివ్వలేదు!

12 Apr, 2022 22:35 IST|Sakshi
సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఏబీవీపీ నాయకులు

ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన 

కాషాయ దుస్తులు తీసి.. యూనిఫాంలో రావాలని ఆదేశం  

ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు, హనుమాన్‌ దీక్షాపరులు

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు:  ఎంపీ సోయం బాపురావ్‌

బోథ్‌: హనుమాన్‌ దీక్షలో ఉన్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం తరగతిలోకి  అనుమతించిన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చరలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సోమవారం జరిగింది. బోథ్‌ మండలంలోని పొచ్చర క్రాస్‌ రోడ్డు వద్ద గల సెయింట్‌ థామస్‌ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న వినయ్, 7వ తరగతి చదువుతన్న రోహిత్‌ ఇటీవల హనుమాన్‌ దీక్ష తీసుకున్నారు. రోజూ లాగానే సోమవారం వారు పాఠశాలకు వచ్చారు. యాజమాన్యం వారిని అడ్డుకుని కాషాయ దుస్తులు తీసి యూనిఫాంలో రావాలని ఆదేశించింది.

యూనిఫాం లేకపోతే పరీక్షలు రాయనివ్వమని స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. వెంటనే వారి తల్లిదండ్రులకు, హనుమాన్‌ దీక్షాపరులకు సమాచారం అందించారు. విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు, హనుమాన్‌ దీక్షాపరులు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయులు ఇమన్యూయల్‌ను నిలదీశారు. ఆందోళన నిర్వహించారు. జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. క్రిస్టియన్‌ పాఠశాల అయినందునే దీక్షలో ఉన్న హిందూ విద్యార్థులను రానివ్వలేదని ఏబీవిపీ నాయకులు ఆకాశ్‌ ఆరోపించారు.

డీఈవో ప్రణీతకు ఫోన్‌ చేసి పాఠశాలపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాషాయ జెండాలను పాఠశాలపై ఎగురవేశారు. పాఠశాలపై చర్య తీసుకుంటామని డీఈవో చెప్పడంతో విద్యార్థులను తరగతిలోకి అనుమతించారు. ఈ విషయమై ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాçపురావ్‌ స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్, జిల్లా విద్యాధికారి ప్రణీతను కోరారు. మరోసారి ఇలాంటి సంఘటనలు çపునరావృతం కాకుండా చూడాలని సూచించారు.   

మరిన్ని వార్తలు