మేకల కాపరిగా కామాగిరి సర్పంచ్‌

20 Jun, 2022 00:55 IST|Sakshi

అప్పులు చేసి అభివృద్ధి పనులు 

కుటుంబ పోషణ కోసం కూలీగా.. 

ఇచ్చోడ: అభివృద్ధి పనులకు నిధులు సరిపోలేదు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదు.. దీంతో సొంత డబ్బు వెచ్చించి.. అప్పులు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేశాడు. అప్పులకు వడ్డీలు కట్టలేక.. కుటుంబాన్ని పోషించేందుకు మేకలు కాస్తున్నాడు.. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం కామాగిరి సర్పంచ్‌ తొడసం భీంరావు దుస్థితి ఇది. కూలి పనులు చేసుకునే ఆదివాసీ దివ్యాంగుడు భీంరావు కామాగిరి జనరల్‌ స్థానం నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

పంచాయతీకి వస్తున్న అరకొర నిధులు ట్రాక్టర్‌ ఈఎంఐ, విద్యుత్‌ బిల్లులు, పారిశుధ్య కార్మికుల వేతనాలకు కూడా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధి కోసం రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుండటం, కుటుంబ పోషణ భారంగా మారడంతో విధిలేని పరిస్థితిలో రోజుకు రూ.200 కూలి కోసం మేకల కాపరిగా మారారు. అప్పులకు వడ్డీలు కట్టేందుకు, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా మారానని భీంరావు ఆవేదన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు