లాక్‌డౌన్‌ లగ్గం; అరే ప్రనీత్‌.. ఎవర్రా ఆ అమ్మాయి..!

17 May, 2021 08:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 సందడి లేదు.. చప్పుడూ లేదు

కనీసం పక్కింటోళ్లకూ తెలియడం లేదు

గుట్టుగా సాగిపోతున్న పెళ్లిళ్లు

నిట్టూరుస్తున్న కొత్త జంటలు

సాక్షి, నిర్మల్‌: ‘అరే ప్రనీత్‌.. ఎవర్రా ఆ అమ్మాయి. పొద్దున బండిపైన ఎక్కించుకుని తీసుకెళ్తున్నవ్‌. కొత్త బట్టలున్నయ్‌. చేతులకు దారాలు కట్టుకున్నవ్‌. ఏందిరా సంగతి..!’ అసలు విషయం తెలియక వరుసకు మామ అడిగిన ప్రశ్నకు ఆ అల్లుడు తల దించుకున్నాడు. ‘ఏం లేదు మామా.. మొన్న నా పెళ్లయిందే. గీ కరోనా చేసుట్ల, లాక్‌డౌన్‌ పెట్టుట్ల ఎవళ్లకు చెప్పలేదే. మనకాడికెళ్లి పెద్దనాన్న, చిననాన్నలు, మేనమామలు, అత్తలు, పిల్లలు అంత కలిపి 25మందిమే పోయినం. మా అత్తగారింటి ముందటనే పెండ్లి చేసిండ్రు. పిల్లకాడికెళ్లి కూడా 30మందే ఉన్నరు. ఏమనుకోకు మామ. లాక్‌డౌన్‌ చేసుట్ల మస్తుమందికి చెప్పలేదే. కరోనా తగ్గినంక పెద్ద దావత్‌ ఇస్తనే..’ అని చెప్పాడు. దీంతో దగ్గరి బంధువైన తనకే చెప్పకుండా పెళ్లి జరగడంపై ఆ మామ అవాక్కయ్యాడు.

ఈ మధ్య.. ఇలా.. చాలా పెళ్లిళ్లే జరుగుతున్నాయి. బంధుమిత్రుల మాట దేవుడెరుగు.. కనీసం పక్కింటోళ్లకు కూడా తెలియకుండా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పెళ్లిళ్లు చిన్నపాటి గొడవలకు, అలకలకూ దారితీస్తున్నాయి. పెళ్లి గురించి వాళ్లకు చెప్పి.. తమకు చెప్పరా.. అంటూ దగ్గరి బంధువులు గొడవ పడుతున్నారు. అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సందడి మధ్య జరగాల్సిన వివాహాలు చడీచప్పుడు లేకుండానే ముగిసిపోతున్నాయి. ‘ఇదేం కరోనారా నాయన.. మా పెళ్లిని ఇట్ల చేసింది..’ అంటూ చాలామంది వధూవరులు వాపోతున్నారు. ఎన్నో ఆశలతో.. ఎంతో వైభవంగా జరుగుతుందనుకున్న మూడుముళ్ల వేడుక కాస్త గుట్టుగా సాగడంతో నిట్టూరుస్తున్నారు.

కరోనా కారణంగా..
జిల్లాకేంద్రంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన కుమారుడి పెళ్లి కోసం అన్ని సిద్ధం చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు కల్యాణం అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు.. పెళ్లితో పాటు రిసెప్షన్‌ పార్టీ కూడా తామే ఇవ్వాలని, ఆ ప్రకారం ఫంక్షన్‌హాల్, గార్డెన్‌ రెండింటినీ మూణ్ణెళ్ల ముందే బుక్‌ చేశారు. పెళ్లి పత్రికలనూ హైదరాబాద్‌ నుంచి తెప్పించి ముద్రించారు. వధూవరులతో పాటు ఇంటిల్లిపాదికీ హైదరాబాద్‌లో షాపింగ్‌ చేశారు. విందులు, వంటకాల కోసం వంట సామగ్రి కూడా ముందే తెచ్చేసుకున్నారు. ఇక మరో పదిరోజుల్లో పెళ్లి ఉందనగా.. కరోనా తీవ్రత పెరుగుతూ పోయింది.

తమ దగ్గరి బంధువులే కోవిడ్‌ బారిన పడ్డారు. చేసేది లేక.. వివాహాన్ని ఒక నెల వాయిదా వేసుకున్నారు. నెల గడిచిపోయింది. కానీ.. కరోనా తగ్గలేదు కదా.. పైనుంచి లాక్‌డౌన్‌ పడింది. దీంతో ఏంచేయాలో పాలుపోలేదు. మళ్లీ వాయిదా వేద్దామంటే.. మున్ముందు ఎలా ఉంటుందోనన్న అనుమానం. దీంతో ఫంక్షన్‌హాల్, గార్డెన్, వంటలు, డెకరేషన్, బ్యాండ్, డీజే.. ఇలా అన్నీ క్యాన్సిల్‌ చేశారు. ఇంటి ముందే రోడ్డుపై చిన్న టెంటు వేసి దగ్గరి బంధుమిత్రులు అంతా కలిపి ఓ 50మందితో పెళ్లితంతు ముగించేశారు. ఇలా జిల్లాలో చాలా కల్యాణాలు ఇప్పుడు ఇలాగే మమ.. అన్నట్లుగా సాగుతున్నాయి. 

నిట్టూరుస్తూనే..
పెళ్లంటే.. జీవితంలో ఓ పెద్దఘట్టం. ప్రతీ మనిషి త న జీవిత భాగస్వామిని పొందే తరుణం. ఇలాంటి వేడుకను అంగరంగ వైభవంగా బంధుమిత్రుల సాక్షిగా చేసుకోవాలనుకుంటారు. తల్లిదండ్రులూ తమ పిల్లల పెళ్లిళ్లను తమ స్థాయికి తగ్గట్లు చేయాలని ఆశి స్తారు. ఇక కొత్త జంట ఎన్నో ఆశలతో, కలలతో పెళ్లి కి సిద్ధమవుతుంది. కానీ.. కరోనా వీటన్నింటికి దెబ్బ కొట్టింది. అసలు ‘ఇప్పుడు పెళ్లి అవసరమా..’ అనే వరకూ తెచ్చింది. ‘సరే.. ఎలాగోలా చేసేద్దాం’ అనేలా తయారైంది. మెహందీ, సంగీత్, హల్దీ, పందిరి.. ఇలా ఎన్నో కార్యక్రమాలతో నాలుగైదు రోజుల పా టు సాగాల్సిన సంబురాలన్నీ రద్దయిపోయాయి. నే రుగా మూడుముళ్ల కార్యక్రమమే కానిచ్చేస్తున్నారు. ఎంతో ఆశలు పెట్టుకున్న తమ పెళ్లి ఇలా ముగిసిపోవడంతో చాలా జంటలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి.

ఆన్‌లైన్‌లోనే..
‘అరె.. సునీల్‌గాడు పెళ్లి చేసుకున్నడురా.. ఇగో ఇటు చూడు స్టేటస్‌ పెట్టిండు..’ అని మిత్రులు కూడా అ వాక్కయ్యే పరిస్థితి. పెళ్లిపత్రికలను పంచడం కూడా చేయడం లేదు. ఆచారం ప్రకారం ఐదారు పత్రికలను ముద్రిస్తున్నారు. వాటినే ఫొటోలు తీసి, సోషల్‌ మీడియా ద్వారా పంపిస్తున్నారు. ప్రస్తుత కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో తమ ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నామని, ఇందుకు మన్నించి వివాహ వేడుకకు హాజరు కావాలంటూ.. ఏదో మాటవరుసకు చెప్పిన ట్లు మెసేజ్‌ పెట్టేస్తున్నారు. ఇక కొంతమంది వివాహా వేడుకను ఆన్‌లైన్‌ ద్వారా తమ బంధుమిత్రులకు చూపుతున్నారు. పెళ్లి ఫోటోలు, వీడియోలను సోష ల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఆయా మాధ్యమాల్లోనే తమను ఆశీర్వదించండంటూ కొత్తజంటలు ఫొటోలు పెట్టడమూ కనిపిస్తోంది.

పొట్ట కొడుతోంది...
పెళ్లంటే.. రెండిళ్ల సంబురమే కాదు. ఎన్నో కుటుంబాలకూ ఉపాధినిచ్చే కార్యక్రమం. గత ఏడాది నుంచి శుభకార్యాల ద్వారా వచ్చే ఉపాధిపై కరోనా దెబ్బకొడుతోంది. ఫంక్షన్‌హాళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. ఫొటోగ్రాఫర్ల దాకా ఎంతోమంది పొట్టకొట్టింది. పెళ్లిళ్లలో, ఫంక్షన్‌హాల్‌లలో చిన్నపాటి పనులు చేసి పొట్టపోసుకునే నిరుపేదలనూ పస్తులు ఉంచుతోంది. పెళ్లిళ్లు చేసేవారికి ఖర్చులు తగ్గిస్తున్నా.. వేడుకలనే నమ్ముకున్నవారికి చేతులు ఆడకుండా చేస్తోంది. కరోనా మహమ్మారి కేవలం పెళ్లింట్లో కల్యాణ వైభవాన్నే కాదు.. ఆ వేడుకపై ఆధారపడ్డ ఫంక్షన్‌హాళ్లు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండు, డీజే, లైటింగ్, డెకరేషన్, వంటవాళ్లు, వేడుకలు పనిచేసే కూలీలు.. ఇలా ఎన్నో కుటుంబాల్లో కళ తప్పేలా చేస్తోంది.   

చదవండి: మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే
కరోనా: పెళ్లిళ్లు చేసుకోవచ్చు.. కానీ!

మరిన్ని వార్తలు