Fire Hair Cut: ఫైర్‌ కటింగ్‌.. ఇప్పుడంతా ఇదే ట్రెంగ్‌ గురూ!

8 Aug, 2021 09:17 IST|Sakshi
ఫైర్‌ కటింగ్‌ చేస్తున్న నర్సింహులు 

 పట్టణంలో కొత్తరకం క్షవరం

ఆసక్తి చూపుతున్న యువకులు

సాక్షి, కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని కొత్త రకం ఫైర్‌ హెయిర్‌ కటింగ్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రధాన నగరాల్లోనే ఉండే ఈ పద్ధతి ఇప్పుడు పట్టణాల్లో అందుబాటులోకి రావడంతో యువత ఆసక్తి చూపున్నారు. స్థానిక భుక్తాపూర్‌లోని ఐస్‌ ఫ్యాక్టరీ సమీపంలో అమెరికన్‌ హెయిర్‌ కటింగ్‌ షాపులో శేర్లవార్‌ నర్సింహులు అనే యువకుడు జట్టుకు నిప్పు పెట్టి కొత్త తరహా కటింగ్‌ చేస్తున్నాడు. హైదరాబాద్‌లో ఫైర్‌ కటింగ్‌లో ప్రావీణ్యం పొంది సొంతగా క్షవరశాలను ఏర్పాటు చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పూణే నగరం నుంచి హెయిర్‌ ఫైర్‌ లిక్విడ్‌ను తెప్పిస్తున్నాడు. దీంతో తను ఉపాధి పొందుతూ.. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాడు.

ఫైర్‌ కటింగ్‌ రూ.500 
రింగులు తిరిగిన జట్టుకు ప్రత్యేకమైన లిక్విడ్‌ పెట్టి నిప్పంటిస్తాడు. ఈరకం కట్టింగ్‌కు రూ.500 చార్జీ అవుతుంది. పిట్టెగూడులా ఉన్న వెంట్రుకలు ఫైర్‌ కటింగ్‌తో ఒక్కసారిగా సిల్కీ స్మూత్‌ హెయిర్‌గా మారుతుంది. దీంతో ఈ తరహ కట్టింగ్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదటి సారి కొత్త తరహా కటింగ్‌ చేసుకున్న వారు దాని ప్రాధాన్యత తెలుసుకుని తరువాత ఫైర్‌ కటింగ్‌ చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. 

ఫైర్‌ కటింగ్‌ బాగుంది
ఫైర్‌ కటింగ్‌ అంటే మొదట్లో కొంత బయమేసింది. తలపై నిప్పు పెట్టడంతో కొద్దిపాటి వేడి కావడంతో బయపడిన. తరువాత నీటితో తలను కడగానే చల్లగా ఉంది. వెంట్రుకలు చాలా స్మూత్, సాఫ్ట్‌గా అయ్యాయి. ఫైర్‌ కటింగ్‌ చాలా బాగుంది.
– అజార్‌ ఖాన్, ఇందిరానగర్‌  

చాలా మందికి తెలువదు
ఆదిలాబాద్‌లో ఫైర్‌ కటింగ్‌ చేస్తున్నట్లు చాలా మందికి తెలువదు. ఈమధ్య కాలంలోనే కొత్తగా ఫైర్‌ కటింగ్‌ చేస్తున్నారని తెలిసి వచ్చాను. కొత్త తరహా కటింగ్‌తో ఎలాంటి నష్టం ఉండదు. వెంట్రుకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.
– సాయికిరణ్, భీంపూర్‌ 

హైదరాబాద్‌లో నేర్చుకున్న 
హైదరాబాద్‌లోని నేచురల్‌ హెయిర్‌ సెల్యూన్‌లో పనిచేసిన సమయంలో ఫైర్‌ కటింగ్‌ గురించి తెలుసుకున్నాను. అక్కడ అనుభవాజ్ఞుల  వద్ద శిక్షణ పొంది నేర్చుకున్నాను. మొదటి సారి ఫైర్‌ కటింగ్‌ చేసుకుంటున్న వారు బయపడుతారు. తరువాత ఈపద్ధతి కటింగ్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు. 
– శేర్లవార్‌ నర్సింహులు, యజమాని  

మరిన్ని వార్తలు