జమీర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత

26 Dec, 2020 11:26 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్‌ జమీర్‌ ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు ఫారూఖ్‌ అహ్మద్‌, అతనికి సహాయపడినవారిని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఘటన జరిగి వారం గుడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని జమీర్‌ బామ్మర్ధి సయ్యద్‌ మీర్జా ఆరోపించారు. కాల్పులకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నా కూడా పోలీసులు నిందితులను అరెస్టు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సమీర్‌ మృతదేహానికి అంత్యక్రియల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉండగా..  పోస్టుమార్టం నిమిత్తం జమీర్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఎంఐఎం ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ ఈ నెల 18న సయ్యద్‌ జమీర్‌పై కాల్పులు జరపడంతో.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ అతను శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. కాల్పుల్లో గాయపడిన మోతేషాన్, ఫారుఖ్‌ కత్తిగాటుకు గురైన  సయ్యద్‌ మన్నన్ ప్రాణాలతో బయటపడ్డారు. పాత కక్షల నేపథ్యంలోనే కాల్పుల ఘటన జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. ఇక ఈ ఘటన అనంతరం ఫారుఖ్‌ను ఎంఐఎం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఆదిలాబాద్‌ జిల్లా శాఖను కూడా ఆ పార్టీ రద్దు చేసింది. 
(చదవండి: అయ్యో జమీర్‌!)

మరిన్ని వార్తలు