హౌసింగ్‌ ఆలస్యం, ఏడేళ్లయినా అందని ఇళ్లు

29 Aug, 2020 10:54 IST|Sakshi
ఆదిలాబాద్‌ న్యూహౌసింగ్‌ బోర్డులో ఇళ్ల నిర్మాణం

సాక్షి, ఆదిలాబాద్‌: పట్టణ మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు హౌసింగ్‌ బోర్డు టెండర్లు పిలిచినా ఇప్పటికీ ఇళ్లు పూర్తి కాలేదు. సొంతింటి కోసం ఏడేళ్లుగా లబ్ధిదారులు ఎదురుచూస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఆదిలాబాద్‌ న్యూహౌసింగ్‌ బోర్డుకాలనీలో 6వ విడతకు సంబంధించి 2013లో 63 ఇళ్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు దరఖా స్తులు స్వీ కరించారు. లబ్ధిదారుల నుంచి ఇంటి నిర్మాణ విలువలో పది శాతం డబ్బులు కూడా వసూలు చేశారు. కాని ఏళ్లు గడుస్తున్నా ఇళ్లకు పునాది పడలేదు. ఇదేమి అడిగితే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని సమాధానం. లబ్ధిదారులు ప్రజాప్రతినిధులను, హౌసింగ్‌ బోర్డు ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండాపోయింది. కొంత మంది విసిగిపోయి హౌసింగ్‌ బోర్డు ఇంటి నిర్మాణంపై ఆశలు వదులుకుని వేరే చోట ఇళ్లు నిర్మించుకున్నారు.

ఇంకొంత మంది తాము కట్టిన డబ్బులను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా హౌసింగ్‌ బోర్డులో ఉలుకూపలుకు లేదు. ఎట్టకేలకు 2020లో ఈ ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. అది కూడా నాసిరకంగా. దీనిపై “నాణ్యత లేమి’ శీర్షికన ఈనెల 25న సాక్షి ప్రచురించిన కథనం సంచలనం కలిగించింది. పలువురు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం జరిగే చోటికి వెళ్లి పరిశీలించారు. ఈ విషయంలో అధికారులనూ నిలదీసినట్లు తెలుస్తోంది. పూర్తి నాణ్యతతో కట్టిస్తామని లబ్ధిదారులకు అధికారులు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇదంతా హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేమి నాణానికి ఒక వైపు కాగా, మరో వైపు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు శాఖలో అక్రమ వ్యవహారాలు అనేకం బయట పడుతున్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లకు 2013లో నోటిఫికేషన్‌ జారీ కాగా ఇన్నేళ్లు ఇళ్లు నిర్మించి ఇవ్వకుండా హౌసింగ్‌ బోర్డు దోబూచులాడుతోంది. లబ్ధిదారుల ఓపిక, సహనాన్ని పరీక్షిస్తోంది. ఇప్పుడు ఇంటి నిర్మాణానికి అడుగులు పడుతున్నా అందులోనూ అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ఆలస్యం వారిది.. భారం వీరికి..
అప్పట్లో ఎల్‌ఐజీ (లోయర్‌ఇన్‌కం గ్రూపు) ఇళ్ల నిర్మాణం కోసం రూ.13.35 లక్షలు, ఎంఐజీ( మిడిల్‌ ఇన్‌కం గ్రూపు)  ఇళ్ల నిర్మాణం కోసం రూ.25.05 లక్షలు నిర్ధారించారు. అయితే టెండరు ఖరారు చేయడంలో ఆలస్యం చేయడంతో ప్రస్తుతం పెరిగిన నిర్మాణ వ్యయాన్ని లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై లబ్ధిదారులు హౌసింగ్‌ బోర్డు అధికారులను కలిసి అడిగినప్పుడల్లా విలువైన స్థలంలో ఇళ్లు కట్టిస్తున్నామని బుకాయిస్తున్నారు. ఇక బ్యాంక్‌ లోన్‌తో కొంత మంది వేరే చోట ఇళ్లు కట్టుకున్న వారు.. ప్రస్తుతం హౌసింగ్‌ బోర్డు ఇళ్లకు బ్యాంకు రుణం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఏడేళ్ల కిందటి నోటిఫికేషన్‌కు ఇప్పుడు ఇళ్లు కట్టించి ఇవ్వడంతో లబ్ధిదారులకు ఎన్నో విధాలుగా నష్టపోయారు. అధికారులు చెబుతున్న ప్రకారం 2018లో ఓ కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. 2019లో పనులు ప్రారంభించారు. ఈ సంవత్సరం నవంబర్‌ వరకు వాటిని పూర్తి చేయాల్సి ఉంది. 

లబ్ధిదారులు కట్టేది రూ.12 కోట్లు
ఎంఐజీ (40), ఎల్‌ఐజీ(23) ఇళ్లకు కలిసి మొత్తం లబ్ధిదారులు కట్టాల్సింది రూ.12 కోట్లు. అయితే ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రూ.7 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు హౌసింగ్‌ బోర్డు అధికారి చెబుతున్నారు. అయితే మొదట్నుంచి పలుమార్లు టెండర్‌ పిలిచినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఈ పరిస్థితిల్లోనే హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌కు పనులను లెస్‌లోనే అప్పగించినట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్‌కు వర్క్‌ అప్పగించినప్పుడు టెండర్లలో ఎంత మంది పోటీ పడ్డారు అనే విషయం చెప్పడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్‌కు టెండర్‌ ద్వారా పనులు అప్పగించారా? లేదా నామినేషన్‌ ఇచ్చారా? అనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ–టెండర్‌ ద్వారా ఖరారు
హౌసింగ్‌ బోర్డు ఇళ్లకు హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌ నుంచే ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించారు. అప్పట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఇళ్ల నిర్మాణంలో ఆలస్యమైంది. 2018–19లో ప్రస్తుతం ఇళ్లు నిర్మిస్తున్నా కాంట్రాక్టర్‌ అంచనా విలువ కంటే తక్కువ వ్యయంతోనే ముందుకు వచ్చాడు. దీంతో రూ.7 కోట్ల విలువైన ఈ పనులు ప్రారంభించాం. నవంబర్‌లోగా నాణ్యతతో ఇళ్లు నిర్మించి ఇస్తాం. – బాల నాయక్, డీఈఈ హౌసింగ్‌ బోర్డు, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు