పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే..

21 May, 2022 11:50 IST|Sakshi
అక్షిత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు, అక్షిత (ఫైల్‌)

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో గర్భిణి మృతి 

సాక్షి, ఆదిలాబాద్‌టౌన్‌: తొలి కాన్పుతో అమ్మతనం ఆస్వాదించాలని ఆమె ఎన్నో కలలు కన్నది. గర్భందాల్చిన నాటి నుంచే పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ మురిసిపోయింది. నెలనెలా పెరుగుతుంటే తన్మయం పొందింది. నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో కాన్పు కాకుండానే కన్నుమూసింది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్‌ రిమ్స్‌లో శుక్రవారం జరిగింది. 

అసలేం జరిగింది.. 
ఆదిలాబాద్‌ పట్టణం పుత్లీబౌళి సమీపంలోని కేవీ.నగర్‌కు చెందిన కొర్రి రాజుకు గతేడాది జూలై 1న ఇచ్చోడ మండలం బోరిగామకు చెందిన అక్షిత(22)తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. గురువారం పురుటినొప్పులు రావడంతో సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులు రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం ఉందని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో మళ్లీ నొప్పులు రావడంతో ఈ విషయాన్ని సమీపంలోని ఆశ కార్యకర్తకు తెలియజేశారు.

దీంతో ఆమె అంబులెన్స్‌లో రిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఫిట్స్‌ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రిమ్స్‌కు 4 గంట లకు చేరుకున్నారు. ఆ తర్వాత మెటర్నిటీ వార్డుకు తీసుకెళ్లగా వైద్యులు అందుబాటులో లేరు. స్టాఫ్‌ నర్సులు మాత్రమే ఉన్నారు. వారు అక్షితకు ఇంజెక్షన్‌ ఇచ్చా రు. ఎలాంటి చికిత్స చేయకపోవడంతో ఉదయం 6 గంటలకు గర్భిణిమృతి చెందింది.  

మృతదేహంతో ఆందోళన..
వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతిచెందిందని అక్షిత కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకరోజు ముందుగా ఆస్పత్రికి వచ్చినా చికిత్స చేయకుండా తిరిగి ఇంటికి పంపించారని తెలిపారు. మళ్లీ పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేక చికిత్స చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స చేస్తే అక్షిత బతికేదని పేర్కొన్నారు.

గర్భిణి మరణ వార్త తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి రిమ్స్‌కు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామని తెలిపారు. ముగ్గురు సీనియర్‌ వైద్యులతో వి చారణ జరిపించి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  

తల్లడిల్లుతున్న తల్లులు..
గర్భిణులతోపాటు గర్భంలోనే శిశువులు మృత్యువాత పడుతున్న ఘటనలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో బాలింతతోపాటు శిశువు మృతిచెందగా, అదే ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ గర్భిణి కడుపులోనే బిడ్డ మృతిచెందింది. రిమ్స్‌ ఆస్పత్రిలో కూడా ఓ గర్భిణి కడుపులోనే శిశువు మృతిచెందగా కనీసం వైద్యులు బయటకు తీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

రిమ్స్‌లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతోనే ఇలాంటివి పునరావృతం అవుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఉదయం 10  నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వైద్యులు ఆ స్పత్రిలో ఉంటున్నారు, తర్వాత ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అత్యవసరం ఉన్నప్పుడు సిబ్బంది ఫోన్‌చేసి సమాచారం ఇస్తేనే వస్తున్నారు. వారు వచ్చేసరికి గర్భిణులు, శిశులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు