30 ఏళ్ల తర్వాత ముఖంపై ఆనందం

6 Apr, 2022 13:11 IST|Sakshi
పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లతో సీఐ వెంకటేశ్‌ 

ఎట్టకేలకు  1990 నుంచి 1996 బ్యాచ్‌ల కానిస్టేబుళ్లకు పదోన్నతి

బాసర జోన్‌ పరిధిలో 211 మందికి, జిల్లాలో 55 మందికి లబ్ధి

సాక్షి, ఆదిలాబాద్‌: మూడు దశాబ్దాల తర్వాత పోలీస్‌ కానిస్టేబుళ్ల మోములో ఓ ఆనందం.. తమకు పదోన్నతి లభించిందన్న దరహాసం.. మంగళవారం ఉదయం ప్రమోషన్లకు సంబంధించి ఉత్తర్వులు వెలుబడ్డాయని తెలియడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎన్నాళ్లో వేచిన ఉదయంలా.. వారి సంతోషానికి హద్దులు లేకుండాపోయాయి. తమ సహచరులు, తెలిసినవారందరికీ ఫోన్‌చేసి నేను హెడ్‌కానిస్టేబుల్‌ అయ్యానని చెప్పుకుంటూ మురిసిపోయారు. స్వీట్లు పంచుకున్నారు. ఇన్నాళ్ల తమ శ్రమకు ఎట్టకేలకు ఫలి తం లభించిందన్న భావన వారిలో కనిపిస్తోంది. 

211 మందికి..
బాసర జోన్‌ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల పోలీసు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి కల్పిస్తూ నిజామాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(సీపీ) నాగరాజు నుంచి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 1990 నుంచి 1996 బ్యాచ్‌లకు చెందిన కానిస్టేబుళ్లకు ఈ పదోన్నతులు కల్పించారు. నిజామాబాద్‌ జిల్లా కానిస్టేబుళ్లకు ఇదివరకే పదోన్నతులు కల్పించడంతో ఈ జోన్‌ పరిధిలోని మిగతా మూడు జిల్లాల కానిస్టేబుళ్లకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతి కల్పించారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన 136 కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. నిర్మల్‌ జిల్లాకు చెందినవారు 55, జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ఉన్నారు.  

నాలుగు జిల్లాల పరిధిలో పోస్టింగ్‌..
హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన వారికి బాసర జోన్‌–2 పరిధిలోని నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలలో పోస్టింగ్‌ ఇచ్చారు. సీనియారిటీ ఆధారంగా వారికి ఆయా ప్రాంతాలు కేటాయించారు. 15 రోజుల్లో వారు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో వారు చేరని పక్షంలో పదోన్నతి కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ గడువు తర్వాత పోలీసు శాఖ కానిస్టేబుళ్ల ఖాళీలపై ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. పదోన్నతుల కారణంగా పలు కానిస్టేబుల్‌ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో లాండ్‌ ఆర్డర్‌ పరంగా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్న భావన పోలీసు అధికారుల్లో వ్యక్తమవుతోంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతన రిక్రూట్‌మెంట్‌ ద్వారా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. 

 పదోన్నతి పొందిన వారికి అభినందన
నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌రూరల్‌ సర్కిల్‌ పరిధిలో కానిస్టేబుల్‌ నుంచి హెడ్‌ కా నిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన వారిని సీఐ వెంకటేశ్‌ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు