ఎండలే కాదు ధరలు మండుతున్నాయ్‌.. కొనలేం.. తినలేం

31 Mar, 2022 11:30 IST|Sakshi

సాక్షి,కౌటాల(అదిలాబాద్‌): జిల్లాలో ఈ ఏడాది కేవలం 30 ఎకరాల్లో పుచ్చకాయల పంటను రైతులు సాగు చేశారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని మోసం, సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో 25 ఎకరాల్లో,  ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని, కెరమెరి, రెబ్బెన మండలాల్లో కేవలం 5 ఎకరాల్లో పుచ్చకాయ పంట సాగవుతున్నట్లు ఉద్యాన శాఖ జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఆరెగూడ, ఈజ్‌గాం, నజ్రుల్‌నగర్, సిర్పూర్‌(టి), వెంపల్లి, రెబ్బెన, గురుడుపేట, డబ్బా, బాబాసాగర్‌ గ్రామాల్లో రైతులు పుచ్చకాయ పంట అధికంగా సాగుచేస్తున్నారు.

వేడిమి నుంచి ఉపశమనం..
వేసవి కాలంలోనే కాకుండా ప్రతీ కాలంలో ప్రజలు పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వీటిపై ఆసక్తి చూపుతారు. రుచిగా, తియ్యగా ఉండే ఈ కాయల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ప్రస్తుతం కర్భూజాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎండలు ముదురుతున్న సమయంలో పుచ్చకాయలు రుచి చూడడానికి అందరూ ఇష్టపడతారు. అందుకే జిల్లాలో ప్రస్తుతం వీటి వ్యాపారం జోరుగా సాగుతోంది.

అధిక ధరలు
జిల్లాలో ఒక్కో పుచ్చకాయ ధర కనిష్టంగా రూ.40 నుంచి గరిష్టంగా రూ.120కు పైబడి ధర పలుకుతున్నాయి. కాయ సైజును బట్టి వ్యాపారులు ధర చెబుతున్నారు. వేసవిలో మాత్రమే పండించే పుచ్చకాయలకు ఎక్కడ లేని డిమాండ్‌ ఏర్పడడంతో సహజంగానే వ్యాపారులు ధర పెంచి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎండతీవ్రత పెరిగే కొద్ది పుచ్చకాయల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఆశించిన స్థాయిలో రైతులు పుచ్చకాయ పంటను సాగు చేయకపోవడంతోనే జిల్లాలో పుచ్చకాయల ధరలు మండిపోతున్నాయని పుచ్చకాయ ప్రియులు పేర్కొంటున్నారు. పేద, సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని స్థితిలో రేట్లు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ధరలు భారీగా పెరిగిపోవడంతో పుచ్చకాయలను తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగుకు ఆసక్తి చూపని రైతులు
గతంలో జిల్లాలో వందల ఎకరాల్లో పుచ్చకాయ పంటను రైతులు సాగు చేసేవారు. పుచ్చకాయ పంట సాగుపై రైతులకు అవగాహన లేకపోవడంతో పాటు సాగునీటి సౌకర్యం లేకపోవడంతో పంటను సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ సంవత్సరం రైతులు జిల్లా వ్యాప్తంగా కేవలం 30 ఎకరాల్లో పుచ్చకాయ పంటను సాగు చేశారు. ఏటేటా పుచ్చకాయ పంట సాగు తగ్గుతుందని, పంటకు సాగునీరు అందక సరైన ఉత్పత్తి లేక పుచ్చకాయ ధర పెరిగిందని పలువురు చెబుతున్నారు. ధరలు తగ్గించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో పుచ్చకాయ పంటను అధికంగా సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.  

కొనలేని పరిస్థితులు ఉన్నాయి
మార్కెట్‌లో పుచ్చకాయ ధర చూస్తే కొనలేని పరిస్థితులు ఉన్నాయి. సాధారణ సైజు పుచ్చకాయ ధర కూడా పేదలకు అందుబాటులో ఉండటం లేదు. జిల్లాలో రైతులు పుచ్చకాయ పంటను అధికంగా సాగు చేయడం లేదు. అందుకే పుచ్చకాయ ధరలు అమాంతం పెరిగాయి.
– జె.రాందాస్, ముత్తంపేట 

ధరలు బాగా పెరిగాయి
పుచ్చకాయల ధరలు అమాంతం పెరిగాయి. మేం ఒక ట్రాక్టర్‌ పుచ్చకాయలను రూ.10 వేలు పెట్టి కొనుగోలు చేస్తున్నాం. దీంతో పుచ్చకాయకు రూ. 40 నుంచి రూ. 100 వరకు అమ్ముతున్నాం. పుచ్చకాయల ధరలు అధికంగా ఉండండతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. 
– డి.గంగారం, పండ్ల వ్యాపారి, కౌటాల  

మరిన్ని వార్తలు