రాజన్న రాజ్యం : ఏపీకి పాదయాత్ర

22 Nov, 2020 13:25 IST|Sakshi
మానకొండూర్‌ మీదుగా సాగుతున్న పాదయాత్ర

వైఎస్సార్‌ పథకాలకు ప్రభుత్వం తూట్లు

వైఎస్సార్‌సీపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలి

ఉట్నూరు నుంచి తాడేపల్లిగూడెం వరకూ పాదయాత్ర

వైఎస్సార్‌సీపీ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కంపెల్లి గంగాధర్‌

సాక్షి, మానకొండూర్‌/శంకరపట్నం: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆదిలాబాద్‌ జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు కంపెల్లి గంగాధర్‌ మండిపడ్డారు. తెలంగాణలో రాజన్నరాజ్యం రావాలని, వైఎస్సార్‌సీపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని, సంక్షేమ పథకాలు కొనసాగాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు నుంచి ఏపీలోని తాడేపల్లిగూడెం వరకూ చేపట్టిన పాదయాత్ర శనివారం మానకొండూర్‌ మీదుగా సాగింది. కేశవపట్నం చేరుకోగా శంకరపట్నం వైసీపీ మండల అధ్యక్షుడు తాళ్ల సురేశ్, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి పాదయాత్రకు స్వాగతం పలికారు.

శంకరపట్నంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. మానకొండూర్, శంకరపట్నంలో గంగాధర్‌ మాట్లాడుతూ ఈనెల18న ఉట్నూరు నుంచి పాదయాత్ర ప్రారంభం అయిందని తెలిపారు. సుమారు వంద కిలోమీటర్లు పూర్తి చేశామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రభుత్వం తూట్లుపొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువస్తే వైఎస్సార్‌ ఆశయాలు నెరవేరుతాయన్నా రు.

ప్రతీ నిరుపేద సొంతింటి కల వైఎస్సార్‌తోనే నెరవేరిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి నిర్మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆరోపించారు. ఉట్నూర్‌ నుంచి తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం వరకూ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. పాదయాత్రలో  జిల్లా మహిళా నాయకురాలు రాయశీలం రమ, మేకల భీమ్‌రావు, దత్తూరి పోశెట్టి, మేకల పోషవ్వ ఉన్నారు.

మరిన్ని వార్తలు