ఉచిత వీసాలతో దళారుల దందా.. 

20 Nov, 2021 03:26 IST|Sakshi

ఉచిత వీసాలు జారీ చేస్తున్న యూఏఈలోని ఏడీఎన్‌హెచ్‌ కంపెనీ  

రూ.30వేల నుంచి రూ.40 వేల వరకువసూలు చేస్తున్నగల్ఫ్‌ ఏజెంట్లు 

నిరుద్యోగుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న వైనం 

మోర్తాడ్‌ (బాల్కొండ) : నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తొర్తికి చెందిన ఎం.నర్సయ్య నిర్మల్‌లో ఒక ఎజెన్సీ నిర్వహించిన గల్ఫ్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఉచిత వీసా అనే ఉద్దేశంతో నర్సయ్య ఇంటర్వ్యూకు వెళ్లగా వీసా కోసం ఏజెంట్‌ అతనిని రూ.50వేలు డిమాండ్‌ చేశాడు. ఇది నర్సయ్య ఒక్కనిదే కాదు ఎంతో మంది వలస కార్మికులకు ఎదురవుతున్న సమస్య. తమ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసుకోవడానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లోని ఆబుదాబి నేషనల్‌ హోటల్‌ కంపెనీ(ఏడీఎన్‌హెచ్‌) ఉచితంగా జారీ చేస్తున్న వీసాలను కొందరు దళారులు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

యూఏఈలోని విమానయాన సంస్థలకు, ప్రయాణికులకు, ఇతరులకు భోజనం సరఫరా చేసే కేటరింగ్‌ను ఏడీఎన్‌హెచ్‌ సంస్థ నిర్వహిస్తుంది. తమ కేటరింగ్‌ నిర్వహణ కోసం ఎక్కువ సంఖ్యలో కార్మికులు అవసరం కావడంతో ఏడీఎన్‌హెచ్‌ సంస్థ భారీ రిక్రూట్‌మెంట్‌కు ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో లైసెన్స్‌డ్‌ గల్ఫ్‌ ఎజెన్సీల ద్వారా ఏడీఎన్‌హెచ్‌ సంస్థ నియామకాలను కొనసాగిస్తోంది. 21 ఏళ్ల వయస్సు నిండి 35 ఏళ్ల లోపువారు ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు కలిగి ఉంటే ఉచిత వసతి, భోజన సదుపాయాలను సదరు సంస్థ కల్పిస్తుంది.

క్లీనింగ్‌ వర్క్‌ వీసాలను జారీ చేస్తున్న సంస్థ వలస కార్మికులకు నెలకు రూ.18 వేల వరకు వేతనం చెల్లిస్తుంది. ఎలాంటి వీసా చార్జీలు, విమాన టిక్కెట్, మెడికల్‌ చార్జీలు లేకుండా కార్మికులు యూఏఈలో ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. అయితే కొందరు గల్ఫ్‌ ఏజెంట్లు నిరుద్యోగుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత వీసాలే అయినా వలస కార్మికుల నుంచి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాగా జగిత్యాల్, పెర్కిట్, నిజామాబాద్‌లలోని ఒక సంస్థ మాత్రం ఉచితంగానే కార్మికులను రిక్రూట్‌మెంట్‌ చేసి యూఏఈకి పంపించింది. గల్ఫ్‌కు వలసలు ఆరంభమైన మొదట్లో కొనసాగిన ఉచిత రిక్రూట్‌మెంట్‌ కరోనా పరిస్థితుల తరువాత మళ్లీ కొనసాగడం విశేషం. గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే కార్మికుల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి లైసెన్స్‌డ్‌ ఏజెంట్లే నియామకాలు చేపట్టాల్సి ఉండగా దళారుల దందా కొనసాగుతుండటం గమనార్హం.

కార్మికులకు అవగాహన లేక నష్టపోతున్నారు... 
ఉచిత వీసాలపై కార్మికులకు అవగాహన లేక నష్టపోతున్నారు. కంపెనీలు జారీ చేసే ఉచిత వీసాలకు ఎవరూ చార్జీలు వసూలు చేయవద్దు. కాని వలస కార్మికుల అవసరాలను కొందరు ఏజెంట్లు ఆసరాగా తీసుకుంటున్నారు. కార్మికులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎన్‌ఆర్‌ఐ సెల్‌పై ఉంది. 
– దొనికెన కృష్ణ, గల్ఫ్‌ కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు 

కొందరు రెండు విధాలుగా లబ్ధి పొందుతున్నారు... 
ఇమిగ్రేషన్‌ చట్టం 1983 ప్రకారం ఎవరైనా వలస కార్మికులకు వీసా జారీ చేసి గల్ఫ్‌కు పంపిస్తే 45 రోజుల వేతనం లేదా రూ.30 వేలను ఫీజుగా తీసుకోవచ్చు. ఒక వేళ కంపెనీ ఉచిత వీసాలను జారీ చేస్తే కార్మికులను రిక్రూట్‌మెంట్‌ చేసే ఎజెన్సీలకు ఆ కంపెనీ ఫీజు చెల్లిస్తుంది. ఏడీఎన్‌హెచ్‌ కంపెనీ ఉచితంగా వీసాలను జారీ చేసి కార్మికులకు లబ్ధి చేకూరుస్తుంది. అయితే ఈ కంపెనీ వీసాలతో కొందరు ఏజెంట్లు రెండు రకాలుగా లబ్ధి పొందుతున్నారు. కంపెనీ నుంచి ఆర్థికంగా ప్రయోజనం పొందుతూనే వలస కార్మికుల నుంచీ వసూలు చేస్తున్నారు. 
– మంద భీంరెడ్డి, గల్ఫ్‌ వ్యవహారాల విశ్లేషకులు 

మరిన్ని వార్తలు