తెలంగాణపై ఆర్‌ఎస్‌వీ పంజా

31 Aug, 2023 03:05 IST|Sakshi

చిన్నారులు సహా పెద్దలపైనా శ్వాస సంబంధిత వైరస్‌ దాడి

రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో శ్వాసకోశ వైరల్‌ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన రెస్పిరేటరీ సింకీషియల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వీ) కేసులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల ఆసుపత్రులు, ఇతర సాధారణ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న శ్వాసకోశ వ్యాధుల్లో ఆర్‌ఎస్‌వీ ఒక ప్రధాన కారణంగా ఉంటోంది. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి.

మరీ ముఖ్యంగా రెండు వారా లుగా వైరల్‌ న్యుమోనియా కేసులు పెరుగుతున్నా యి. జలుబు కాస్తా న్యుమోనియాగా దారితీస్తుంది. దమ్ము కూడా వస్తుంది. 5 ఏళ్లలోపు... 60 ఏళ్లు పైబడిన లేదా దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై దీని ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ఇతర వయసువారిపైనా ప్రతాపం చూపిస్తోంది. జ్వరం, జలుబు, కఫంతో కూడిన తీవ్రమైన దగ్గు, నిమ్ము, బలహీనత రెండు వారాల వరకు ఉంటుంది.

చిన్న పిల్లల్లో ఐసీయూకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దగ్గు వచ్చిన మొదట్లోనే అప్రమత్తం కావాలని, చిన్నపిల్లలు మూడు నాలుగు రోజుల తర్వాత అది నిమ్ము దశకు చేరుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆర్‌ఎస్‌వీలో ఏ, బీ అనే రెండు రకాలున్నాయి. ఇప్పటివరకు ఇండియా 587 ఏ రకం వైరస్, 344 బీ రకం వైరస్‌లను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది.  

ఏడాదికి సగటున దేశంలో 3.31 కోట్ల చిన్నారులపై వైరస్‌ పంజా... 
ప్రతీ ఏడాది భారత్‌లో సగటున 3.31 కోట్ల మంది చిన్నారులు ఆర్‌ఎస్‌వీ బారిన పడుతున్నారు. వారిలో 10 శాతం మంది ఆసుపత్రుల పాలవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏడాదికి ఈ వైరస్‌ వల్ల దేశంలో 59,600 మంది చనిపోతున్నారు.

రెండేళ్లు నిండిన ప్రతి చిన్నారి ఒక్కసారైనా ఈ వైరస్‌ బారినపడతారు. ఈ సంవత్సరం దాని ప్రభావం మరింత పెరిగింది. ఐదు వారాల క్రితం వరకు ఈ వైరస్‌ పాజిటివిటీ రేటు 5 శాతంలోపుగా ఉంటే, ప్రస్తుతం 10 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. ఐసీఎంఆర్‌ డ్యాష్‌బోర్డ్‌ ప్రకారం వైరల్‌ కేసుల్లో 15 శాతం ఆర్‌ఎస్‌వీ కేసులే. 

మరిన్ని వార్తలు