MLC Polls: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండే విఠల్‌ కోటీశ్వరుడు..

29 Nov, 2021 09:20 IST|Sakshi

పుష్ప ఆస్తులు: రూ.50 లక్షలు 

అఫిడవిట్‌లో వెల్లడించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు

దండే విఠల్‌ పేరున రూ.6.20 కోట్లు

ఆయన భార్య పేరున రూ.13.40 కోట్లు

సాక్షి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ స్థానిక శాసనమండలి బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు వెల్లడయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండే విఠల్‌ స్థిర, చరాస్తులు కలిపి మొత్తం ఆస్తులు రూ.6.20 కోట్లు ఉండగా, ఆయన భార్య పేరిట రూ.13.29 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక విఠల్‌ వివిధ బ్యాంకులకు రూ.23.29 లక్షలు బాకీ ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఇంద్రవెల్లి మండలానికి చెందిన పెందూర్‌ పుష్పరాణి స్థిర, చరాస్తులు కలిపి మొత్తం రూ.50 లక్షలు ఉన్నాయి.

ఎమ్మెల్సీ నామినేషన్‌తో సమర్పించిన అఫిడవిట్‌లో వీరిద్దరు వారి ఆస్తులను వెల్లడించారు. అలాగే పుష్పరాణిపై మూడు క్రిమినల్‌ కేసులు ఉండగా, ప్రస్తుతం అవి పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విఠల్‌ తనపై ఎలాంటి కేసులు లేవని తెలిపారు. 
చదవండి: MLC Elections: విఠల్‌ ఏకగ్రీవానికి టీఆర్‌ఎస్‌ విఫలయత్నం.. ‘విత్‌డ్రా’మా.. వివాదం

పుష్పరాణి ఆస్తులు ఇలా.. 
ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పెందూర్‌ పుష్పరాణి చరాస్తులు, స్థిరాస్తులు కలిపి మొత్తం రూ.50 లక్షలు ఉన్నాయి. వాటిని ఓ సారి పరిశీలిస్తే.. పుష్పరాణి వద్ద ప్రస్తుతం వెండి, బంగారం ఉంది. వాటి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.25 లక్షలుగా ఉంది. పుష్పరాణి పేరున ఇంద్రవెల్లిలోని డొంగర్‌గావ్‌ సర్వే నంబర్‌ 77/225లో 3.39 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ భూమి ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.25 లక్షలుగా ఉంది.  

విఠల్‌ ఆస్తులు ఇవీ.. 
దండె విఠల్‌ చరాస్తులు మొత్తం రూ.3కోట్ల 76లక్షల 33వేల 484 ఉన్నాయి. ప్రస్తుతం విఠల్‌ చేతిలో రూ.2లక్షల16వేల 500 నగదు ఉంది. హైదరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు పంజాగుట్ట, ఎస్‌బీఐ సనత్‌నగర్, యూనియన్‌ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.22.11లక్షలు ఉన్నాయి. నవీత్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.7.50 లక్షల షేర్, సాన్వీ ల్యాబొరేటరీస్‌లో రూ.1.65 కోట్ల షేర్, తాన్వీ హెల్త్‌ కేర్‌లో రూ.50 వేల షేర్, అనిక ఇన్‌ఫ్రా డెవలపర్స్‌లో రూ.28.25 లక్షల షేర్‌ ఉంది. ఇక తాన్వీ హెల్త్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1.38 కోట్లు, విఠల్‌ దగ్గరున్న 250 గ్రాముల జ్యావెల్లరీ విలువ రూ.12.50 లక్షలుగా ఉంది. 

స్థిరాస్తులు ఇలా.. 
విఠల్‌ పేరున మొత్తం స్థిరాస్తులు రూ.2కోట్ల 44లక్షల 64వేలు ఉన్నాయి. కాగజ్‌నగర్‌లోని వేంపల్లి శివారులో 10.08 ఎకరాల వ్యవసాయ భూమి, మోసం గ్రామ శివారులోని పలు సర్వే నంబర్లలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ రెంటి భూముల విలువ ప్రస్తుత మార్కెట్‌ విలువల ప్రకారం రూ.44.64 లక్షలుగా ఉంది. రెబ్బెన మండల కేంద్రంలోని సర్వే నంబర్‌ 210లో 27,225 స్క్వేర్‌ ఫీట్స్‌ నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ ఉంది. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.20 లక్షలుగా ఉంది. ఇక సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో 1,953 స్క్వేర్‌ ఫీట్స్‌ స్థలంలో నివాస భవనం ఉంది. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ రూ.1.80 కోట్లు. ఇవే కాకుండా విఠల్‌ భార్య పేరున చరాస్తులు రూ.13.18 కోట్లు, స్థిరాస్తులు రూ.27.90 లక్షలుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఐసీఐసీఐ బ్యాంకులో విఠల్‌ తీసుకున్న హోమ్‌ లోన్‌కు సంబంధించి రూ.23.29 లక్షలు బాకీ ఉన్నారు.  

మరిన్ని వార్తలు