36 ఏళ్ల తర్వాత ఆమెను, ఆ కుటుంబాన్ని.. ఫేస్‌బుక్‌ కలిపింది!

2 Nov, 2021 14:08 IST|Sakshi
తండ్రిని ఆలింగనం చేసుకున్న మంగమ్మ 

ఏడేళ్ల ప్రాయంలో ‘తప్పిపోయిన’మంగమ్మ

36 ఏళ్ల తర్వాత దొరికిన కుటుంబసభ్యుల ఆచూకీ

అక్కను పుట్టింటికి తీసుకొచ్చిన సోదరులు

తండ్రిని చూసి కన్నీటిపర్యంతమైన మంగమ్మ

ఆనందోత్సాహాల్లో కుటుంబ సభ్యులు

సాక్షి, మదనాపురం(మహబూబ్‌నగర్‌: ఏడేళ్ల ప్రాయంలో తప్పిపోయింది. ఎక్కడో పెరిగింది. పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. 36 ఏళ్ల తర్వాత ఆమెను, ఆ కుటుంబాన్ని ఫేస్‌బుక్‌ కలిపింది. వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నిలివిడికి చెందిన క్యాసాని నాగన్న, తారకమ్మ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవించేవారు. వీరికి సత్యమ్మ, నాగేశ్వరమ్మ, మంగమ్మ, వెంకటేష్‌, కృష్ణ సంతానం.

కాగా, 1985లో హైదరాబాద్‌లో ఒకరి ఇంట్లో పనిచేసేందుకు ఏడేళ్ల మంగమ్మను కుదిర్చారు. మూడు రోజుల అక్కడే ఉన్నా.. తర్వాత తల్లిదండ్రులపై బెంగతో బయటకు వచ్చింది. అదే ప్రాంతంలో భిక్షాటన చేసే వ్యక్తి తల్లిదండ్రులను చూపిస్తానంటూ ఏపీలోని గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపనికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ చర్చి వద్ద ఆమెను వదిలి వెళ్లిపోయాడు. 

చదవండి: Huzurabad Bypoll 2021: గెల్లు సొంత గ్రామంలో కారు పంక్చర్‌

భాస్కర్‌నాయక్‌ పరిచయంతో..: చర్చి ముందు రోదిస్తున్న ఆ చిన్నారిని కనగల సామెలు గమనించి తమ ఇంటికి తీసుకెళ్లాడు. తన సంతానంతోపాటు మంగమ్మనూ పెంచి పెద్దచేశాడు. కొల్లిపర మండలం దవులూరుకు చెందిన అంబటి దాసుతో వివాహం చేశాడు. వీరికి శాంతకుమారి, వసంతకుమారి జన్మించారు. 2019లో శాంతకుమారిని యాలవర్రుకు చెందిన కిష్టఫర్‌తో వివాహం జరిపించారు. అయితే.. తన తల్లిదండ్రులు, తోబుట్టువులను చనిపోయేలోపు చూస్తానన్న ఆశ నెరవేరుతుందో.. లేదో.. అని మంగమ్మ బాధపడుతుండేది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కిష్టఫర్‌.. గూగుల్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా ద్వారా మంగమ్మ కుటుంబసభ్యుల గురించి తెలుసుకోడానికి యతి్నంచాడు.

ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ లో నెలివిడికి చెందిన భాస్కర్‌నాయక్‌ పరిచయమయ్యాడు. ఆమె వివరాల ను భాస్కర్‌ కూడా పరిశీలించాడు. అలా కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిసింది. ఆమె సోదరులు వెంకటేష్, కృష్ణ 3 రోజుల క్రితం దవులూరుకు వెళ్లి మంగమ్మతో పాటు భర్త దాసును సోమవారం స్వగ్రామానికి తీసుకొచ్చా రు. ఒక్కసారిగా తండ్రిని చూడగానే మంగమ్మకు కన్నీళ్లు ఆగలేదు. అక్కతో పాటు బావ, కోడళ్లకు చీర, సారెలు పెడతామని తమ్ముళ్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు