దాసోజు బాటలో మరికొందరు.. కమలం వైపు మొగ్గు? 

6 Aug, 2022 12:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌లో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ పార్టీని వీడడం నగర కాంగ్రెస్‌లో ఒకింత కలవరం రేపిందని చెప్పాలి. టీఆర్‌ఎస్‌ నేత, కార్పొరేటర్‌ విజయారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కినుక వహించిన శ్రవణ్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తనతో కనీసం సంప్రదించకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. కాగా, దాసోజు కమలం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఇప్పటికే నగరానికి రథసారధి లేక కేడర్‌ కొట్టుమిట్టాడుతుండగా, ఉన్న ముఖ్య నాయకులు సైతం ఒక్కొక్కరు జారుకోవడం హస్తం పార్టీని మరింత బలహీనపరుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌కు గ్రేటర్‌పై దృష్టి కేంద్రీకరించడం లేదన్న అపవాదును ఇప్పటికే ఎదుర్కొంటోంది. రాష్ట్ర రాజధానిగా..రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న మహానగరంలో కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం కరువైంది.

మరోవైపు రెండేళ్లుగా కమిటీ లేని హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌ను మూడు జిల్లాలుగా విభజించి కమిటీలు వేయాలన్న ఏఐసీసీ నిర్ణయం సైతం అటకెక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నగరంలో చతకిలపడిన పార్టీలో జవసత్వాలు నింపే ప్రయత్నం సాధ్యం కానీ పరిస్ధితి నెలకొంది. వాస్తవంగా స్థానికంగా కూడా నాయకత్వం కరువైంది.   
చదవండి: పార్టీలో చేరికలపై ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు

వరుస ఓటములతో..  
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం వరుస ఓటములతో పార్టీ కుదేలైంది. సంస్థాగతంగా కూడా బలహీన పడింది. గతంలో గ్రేటర్‌ నేతలు అనునిత్యం ఏదో ఒక కార్యక్రమాలతో ప్రజల మధ్యలో ఉండేవారు. శివారు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు అధికార పారీ్టలో చేరిపోయారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ నగర అధ్యక్షుడు తన బాధ్యతలకు రాజీనామా చేయడంతో సారధి లేకుండా పోయారు. మరోవైపు పార్టీ సంస్థాగతంగా కూడా  బలహీనపడింది. తాజాగా  పార్టీ కీలక నేతలు మరికొందరు జారుకోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. 

దాసోజు బాటలో మరికొందరు.. 
కమలం ఆకఆపరేషన్‌లో భాగంగా మరికొందరు దాసోజు బాటలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో గ్రేటర్‌ కాంగ్రెస్‌ ముఖ్య నేతలపై కూడా వల విసరడంలో కమలనాధులు సఫలీకృతమైతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే  దాసోజు ఆపరేషన్‌ విజయవంతమైంది. మిగిలిన అసంతృప్త వాదులను పారీ్టలో చేర్చుకునేందుకు తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. నగరం నడిఒడ్డులో గల అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పలుమార్లు బరిలో దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కాంగ్రెస్‌ ముఖ్యనేత పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు