విషాదం: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్‌.. అంతలోనే

25 Apr, 2021 02:24 IST|Sakshi

ఆస్పత్రిలో చేర్చిన వెంటనే ఆగిన పల్స్‌

ఆర్‌ఎంపీ వైద్యుడు కరోనాతో మృతి

జోగిపేట (అందోల్‌): బెడ్స్‌ కోసం పదులకొద్దీ ఆస్పత్రులు తిరిగారు. చివరకు ఎలాగో దొరికిందనుకుని బెడ్‌పై చేర్చినంతనే శ్వాస ఆగి కన్నుమూసిన వైద్యుడి విషాదమిది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వాసవీనగర్‌ కాలనీకి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ కిష్టయ్య 25 ఏళ్లుగా బొడ్మట్‌పల్లి గ్రామంలో క్లినిక్‌ను ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 20-30 గ్రామాల్లో ఆయన వైద్యంపై అపార నమ్మకం. కిష్టయ్యకు కరోనా సోకడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఆయన కుమారులు హైదరాబాద్‌కు తరలించారు. 20కి పైగా ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా బెడ్స్‌ దొరకలేదు.

చివరికి శనివారం తెల్లవారుజామున ఓ ఆస్పత్రిలో బెడ్‌ దొరగ్గానే వెంటనే చేర్చారు. అయితే వైద్యులు నాడి చూసేసరికే శ్వాస ఆగిపోయింది. డాక్టర్‌ కిష్టయ్య జోగిపేట లైన్స్‌క్లబ్‌ సభ్యుడిగా కూడా ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఇలా రోజుల వ్యవధిలోనే అస్వస్థతకు గురై మృత్యువాత పడడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతదేహానికి స్వగ్రామమైన బిజిలీపూర్‌లో కరోనా నిబంధనల మేరకు శనివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. కడచూపునకు కూడా నోచుకోకపోవడంపై బంధువులు, స్నేహితులు బాధను వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: అందరికీ ఉచితంగా టీకా.. సీఎం కేసీఆర్‌

చదవండి: వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే

మరిన్ని వార్తలు