మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి

16 Mar, 2021 08:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కూకట్‌పల్లి: రోజురోజుకు కూకట్‌పల్లిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా విచ్చలవిడిగా తిరగడం, సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకుండా బయటకు రావడమే కేసుల పెరుగుదలకు కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గత 15 రోజులుగా కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో ప్రతిరోజూ పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 కేసుల వరకు నమోదైనట్లు తెలుస్తోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కేసుల వివరాలు తెలుస్తుండగా, ప్రైవేట్‌లో చేరే వారి సంఖ్య బయటకు రావటం లేదు. ముఖ్యంగా వారాంతపు సంతలు, షాపింగ్‌ మాళ్లు, సినిమా హాళ్లు, శుభకార్యాల్లో ప్రజలు భారీగా హాజరవటమే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోకపోవటంతో పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

మార్చి 13 తేదీన మూసాపేట, కూకట్‌పల్లి యూపీహెచ్‌సీ సెంటర్‌లో 15 కేసులు నమోదు కాగా, 14న మూసాపేటలో 6 నమోదయ్యాయి. అదే విధంగా సోమవారం 15న కూకట్‌పల్లి, మూసాపేటలో కలిపి 15 కేసులు నమోదయ్యాయి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రతి రోజూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కూకట్‌పల్లి ప్రాంతంలో రెండోసారి కరోనా వచ్చిన వారి సంఖ్య కూడా పదుల సంఖ్యలోనే ఉంది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో లక్షలు వెచ్చించి చికిత్స పొందుతున్న సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుటికైనా కోవిడ్‌ –19 నిబంధనలు పాటించాలని వైద్యులు, అధికారులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు