Agnipath Scheme Protests: పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదం.. గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

18 Jun, 2022 19:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి వద్ద భారీ బలగాల మోహరింపుతో శనివారం సాయంత్రం హైటెన్షన్‌ నెలకొంది. అగ్నిపథ్‌ నిరసనల్లో  గాయపడ్డ అభ్యర్థులను పరామర్శించేందుకు వెళ్లారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

అభ్యర్థులను పరామర్శించేందుకు వెనుక గేటు నుంచి గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లారు రేవంత్‌రెడ్డి. అనంతరం బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో.. పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ప్రస్తుతం మెయిన్‌ గేట్‌ వద్ద పోలీసులు భారీ బలగాలు మోహరించారు.

నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల సంగతేంటి?
ఘట్‌కేసర్‌:
సైన్యంలోనూ అవుట్‌ సోర్సింగ్‌కు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు. అగ్నిపథ్‌ నిరసనల మీద స్పందించిన ఆయన.. నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ‘‘అగ్నిపథ్‌తో దేశభద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు. సైన్యంలో చేరడానికి రాతపరీక్షల కోసం.. 20 నెలలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు’’ అని ఆయన అన్నారు. అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకునేంత వరకు కేంద్రంపై పోరాటం తప్పదని స్పష్టం చేశారాయన.  

ఇదిలా ఉంటే.. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో చనిపోయిన వరంగల్‌ ఆర్మీ ఉగ్యోగ అభ్యర్థి రాకేశ్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత.. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ శ్రేణులు ఘట్ కేసర్ లో  నిరసన చేపట్టారు.

గాంధీ భవన్లో సత్యాగ్రహ దీక్ష
నాంపల్లి:
 అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని.. ఏఐసీసీ పిలుపులో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు