పంటల వైవిధ్యంతోనే ప్రగతి

9 Dec, 2021 04:09 IST|Sakshi

ఎమ్మెస్‌ స్వామినాథన్‌ అవార్డు ప్రదానంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా, సుస్థిరంగా, పర్యావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దేందుకు పంటల వైవిధ్యానికి పెద్దపీట వేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు.  బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విశ్రాంత ఐసీఏఆర్‌ ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్‌ లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెస్‌ స్వామినాథన్‌ అవార్డు ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ వి.ప్రవీణ్‌ రావ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు.  ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ దేశీయ వ్యవసాయ రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని.. కావాల్సిందల్లా ఈ రంగానికి సరైన సమయంలో అవసరమైన చేయూతను అందించాలని సూచించారు. రైతులకు సమయానుగుణ సూచనలు చేస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

తృణధాన్యాల ఉత్పత్తిని మెల్లగా తగ్గిస్తూ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, సిరి ధాన్యాల ఉత్పత్తి దిశగా రైతులను ప్రోత్సహించాలని కోరారు. బిందుసేద్యం, సూక్ష్మ సాగునీటి పద్ధతులను పాటిస్తూ సాగునీటి నిర్వహణ విషయంలో రైతులకు మార్గదర్శనం చేస్తూ.. వారు తమ పంట ఉత్పత్తులు పెంచుకునేలా చేయడంలో డాక్టర్‌ ప్రవీణ్‌ రావు కృషి చేశారని ఉపరాష్ట్రపతి అభినందించారు. భారత్‌లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతోపాటు ప్రస్తుతం ప్రపంచ వ్యవసాయ రంగంలో దేశానికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించే విషయంలో ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ సేవలు చిరస్మరణీయమన్నారు.

మన దేశంలో మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఆయా వస్తువులను ఉత్పత్తి చేసే దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ కమతాల పరిమాణాలు తగ్గిపోతుండటం, వర్షంపై ఆధారపడటం, పరిమిత సాగునీటి సదుపాయాలు, సరైన సమయానికి వ్యవసాయ రుణాలు అందకపోవడాన్ని ప్రస్తావించారు. పంట ఉత్పత్తులకు ఊహించినంత మద్దతు ధర అందకపోవడం, అవసరమైనంత మేర శీతల గిడ్డంగుల వ్యవస్థ లేకపోవడం, సరైన మార్కెటింగ్‌ నెట్‌ వర్క్‌ లేమి తదితర అంశాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తి ప్రభావితం అవుతోందన్నారు.

ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం ద్వారా భారతీయ వ్యవసాయ రంగ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృంద స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఐసీఆర్‌ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ ఎంవీఆర్‌ ప్రసాద్, నూజివీడు సీడ్స్‌ చైర్మన్, ఎండీ ఎం.ప్రభాకర్‌ రావు పాల్గొన్నారు.  

రావత్‌ మృతికి సంతాపం 
ఈ కార్యక్రమం సాగుతుండగా బిపిన్‌ రావత్‌  మృతి గురించి తెలిసి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్, సతీమణి మధులిక రావత్, ఇతర ఆర్మీ అధికారులు తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని వెంకయ్య పేర్కొన్నారు.

ప్రమాద ఘటన గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో మాట్లాడి సమాచారం తెలుసుకున్నామని చెప్పారు. బిపిన్‌ రావత్‌ సహా ఈ ఘటనలో మృతి చెందిన ఆర్మీ అధికారుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. 

మరిన్ని వార్తలు