లక్ష్యానికి దూరంగా పత్తి సాగు.. 43.94 లక్షల ఎకరాలకే పరిమితం  

1 Aug, 2022 02:20 IST|Sakshi

ప్రతిపాదిత సాగు 70 లక్షల ఎకరాలు 

ఇప్పటివరకు 43.94 లక్షల ఎకరాలకే పరిమితం 

అందులో 8 లక్షల ఎకరాలు మునకలోనే.. 

జూలై వరకే పత్తి వేసేందుకు రైతులకు అవకాశం 

తర్వాత వరి, మొక్కజొన్నకే అనుకూలం 

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి పత్తి విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని భావించిన వ్యవసాయ శాఖకు నిరాశ తప్పేట్లు లేదు. గతేడాది పత్తికి భారీగా ధర రావడంతో వరికి బదులు పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించినా ఆచరణలో అది సాధ్యమయ్యే అవకాశం లేకుండా పోతోంది. వరుసగా భారీ వర్షాలు, వరదలు రావడంతో వేసిన పంటే చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో లక్ష్యం నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అటు వ్యవసాయశాఖ, ఇటు రైతులు కూడా ఆవేదనకు గురవుతున్నారు.  

ఈ నెలాఖరు వరకే అదును 
వానాకాలం సీజన్‌లో తొలకరి వర్షాలతోనే పత్తి విత్తనాలు చల్లుతారు. జూన్‌లో పత్తి సాగు మొదలై జూలై చివరి నాటికి ఆ పంట వేయడం పూర్తి కావాలి. అంటే దాదాపు ఇప్పటికే పత్తి సాగు చేసి ఉండాలి. కానీ భారీగా కురుస్తున్న వర్షాలు, వరదలతో పత్తి సహా అనేక పంటలు నీట మునిగాయి. ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 69.70 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.

మొత్తం సాగు విస్తీర్ణంలో పత్తి ప్రతిపాదిత సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 43.94 లక్షల ఎకరాల్లో సాగైంది. లక్ష్యం చేరుకోవాలంటే పత్తి సాగు పెద్దఎత్తున పెరగాలి. కానీ 70 లక్షల ఎకరాలకు చేరుకోవడం కష్టమేనని అధికారులు అంటున్నారు. ఇప్పటికే వేసిన పత్తిలో దాదాపు 8 లక్షల ఎకరాలు నీట మునగడం, అందులో మరికొంత ఇసుక మేట వేయడం, ఇంకొన్నిచోట్ల పూర్తిగా విత్తనాలు భూమిలోనే కుళ్లిపోవడం వంటివి జరిగాయి.

అటువంటి చోట్ల మళ్లీ రెండోసారి పత్తి వేయాలన్నా కూడా భూమి పూర్తిగా ఆరిపోవాలి. మళ్లీ దుక్కిదున్నాలి. కానీ ఇప్పుడు వర్షాలు తగ్గలేదు. తగ్గాక దుక్కిదున్ని వేయాలంటే మరో 15 రోజులకు పైగా సమయం పట్టొచ్చు. అప్పటికే అదును తీరిపోతుందని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. భద్రాచలం, సంగారెడ్డి సహా ఒకట్రెండు చోట్ల మాత్రం కొందరు రైతులు మళ్లీ పత్తి విత్తనాలు కావాలని విన్నపాలు చేశారు. ఏది ఏమైనా ఈసారి పత్తి సాగు 50 లక్షల ఎకరాలకు మించక పోవచ్చని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.  

రైతులకు మూడు ప్రత్యామ్నాయాలు 
పత్తి వేయాలన్న రైతుల ఆశలను వర్షాలు అడియాశలు చేశాయి. కోట్ల రూపాయల పెట్టుబడికి నష్టం వాటిల్లింది. దీంతో రైతులకు మూడే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని వ్యవసాయ వర్గాలు అంటున్నాయి. ఒకటి పత్తి వేసే అవకాశం ఉంటే రెండోసారి వేయడం. రెండోది ప్రత్యామ్నాయంగా తేలికపాటి నేలల్లో, నీటి వనరులు ఉన్నచోట వరి వేయడం.. సాధ్యంకాని చోట మొక్కజొన్న వేసుకోవడం.

అలాగే మూడోది ముందస్తు రబీకి వెళ్లడం. ముందస్తు రబీలో భాగంగా వేరుశనగ వంటి పంటలు వేయాల్సి ఉంటుంది. వరి, మొక్కజొన్న వంటి వాటిని వచ్చే రెండు మూడు వారాల్లోగా వేయాల్సి ఉంటుంది. వర్షాలు భారీగా కురవడంతో రైతులు వరి నాట్లవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత మొక్కజొన్న వేస్తారంటున్నారు. ప్రభుత్వం తలచినది ఒకటైతే, వాతావరణ పరిస్థితుల వల్ల మరోటి జరుగుతోందని అంటున్నారు.  

మరిన్ని వార్తలు