యాసంగి వరికి ఆంక్షల్లేవ్‌!

13 Oct, 2022 04:16 IST|Sakshi

గతేడాది విధించిన సాగు ఆంక్షల ఎత్తివేతకు వ్యవసాయ శాఖ నిర్ణయం

రైతులు ఎన్ని ఎకరాల్లోనైనా సాగు చేయొచ్చు.. మిల్లర్లు నేరుగా ఎగుమతి చేసుకునే అవకాశమే కారణం.. 

భారీగా నీటి వనరులతో పెరగనున్న వరి సాగు.. ఈసారి వరి కొనుగోలు సమస్య తలెత్తదంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి యాసంగిలో వరి సాగుకు ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. గత యాసంగిలో వరి వేయొ ద్దని రైతులకు సూచించగా.. ఈసారి అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నందున వరి వేసుకోవడానికి ఆంక్షలు ఉండవని పేర్కొన్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో యాసంగి సీజన్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇంకా కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ నడుస్తుండగానే యాసంగి వరిసాగుపై వ్యవసాయ శాఖ స్పష్టత ఇచ్చింది. ఈ యాసంగిలో వరి సాగు విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు.

కేంద్ర ఎగుమతి విధానంతో మారిన సీన్‌
గత యాసంగిలో వరి వేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం స్పెషల్‌ డ్రైవ్‌ కూడా చేపట్టింది. అయినా గణనీయంగానే వరి సాగవడం, ధాన్యం కొనుగోళ్ల విషయంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తడం కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం గత నెలలో బియ్యం ఎగుమతికి సంబంధించి కొత్త విధానాన్ని ప్రకటించింది. కేంద్రం ముడి బియ్యం ఎగుమతులపై 20శాతం సుంకాన్ని, నూకల ఎగుమతిపై నిషేధాన్ని విధించింది.

ఈ నిబంధన నుంచి బాస్కతి, బాయిల్డ్‌ రైస్‌లను మినహాయించింది. దీనివల్ల ముడి బియ్యం ఎగుమతులు తగ్గి, ఉప్పుడు బియ్యం (బాయిల్డ్‌ రైస్‌) ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఏర్పడింది. తద్వారా ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ పెరుగుతుందని.. యాసంగి ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసి, ఉప్పుడు బియ్యంగా మార్చి ఎగుమతులు చేసే వెసులుబాటు పెరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రికార్డు స్థాయిలో సాగయ్యే అవకాశం
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో నీటి వనరులు అందుబాటులోకి రావడం, పలు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తవడం, మంచి వర్షాలతో కొన్నేళ్లు రాష్ట్రంలో వరి అంచనాలకు మించి సాగవుతుంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వరి సాగైంది. నిజానికి ఈ వానాకాలం సీజన్‌లో పత్తిసాగు పెంచాలని సర్కారు రైతులకు సూచించింది. 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని భావించింది.

భారీ వర్షాలతో చాలాచోట్ల విత్తిన పత్తి దెబ్బతిన్నది సాగు 50 లక్షల ఎకరాలకే పరిమితమైంది. మరోవైపు వరిని 45 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలకున్నా.. రైతులు 64.54 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఇప్పుడు యాసంగిలో వరిపై ఆంక్షలు ఎత్తివేయడం వల్ల గణనీయంగా సాగు పెరిగే అవకాశముంది. 2020–21 యాసంగిలో 52.28 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ప్రభుత్వ సూచనల మేరకు 2021–22 యాసంగిలో కాస్త తగ్గి 35.84 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ఈసారి ఆంక్షలు లేకపోవడం, వానలు కురిసి జల వనరులన్నీ నిండటం, భూగర్భ జలాలు పెరగడంతో.. 2020–21కు మించి వరి సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కొన్నేళ్లుగా యాసంగిలో వరిసాగు తీరు (లక్షల ఎకరాల్లో)
ఏడాది    సాగు విస్తీర్ణం

2017–18    19.20
2018–19    17.30
2019–20    38.62
2020–21    52.28
2021–22    35.84  

మరిన్ని వార్తలు