రైతుకు అండ: పలుగు, పార, ట్రాక్టర్‌ అన్నీ ఒకేచోట..

14 Jul, 2021 02:52 IST|Sakshi

గజ్వేల్‌లో సమీకృత రైతు సేవాకేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు

ఎరువులు,పురుగు మందులు ఇతర ఉత్పత్తులు కూడా..

దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.8.50 కోట్లతో ఏర్పాటు

లాభాపేక్ష లేకుండా తక్కువ ధరలకే రైతులకు విక్రయం

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గడ్డపారలు, నాగళ్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు (కోత యంత్రాలు) వంటి చిన్నా పెద్దా వ్యవసాయ పరికరాలతో పాటు.. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు.. ఇలా సాగుకు అవసరమైనవన్నీ ఒకే చోట రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సమీకృత రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి మెదక్‌ జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) సన్నాహాలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ‘‘వన్‌ స్టాప్‌.. వన్‌ షాప్‌.. వన్‌ సొల్యూషన్‌..’’ పేరుతో పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. కార్పొరేట్‌ కంపెనీ షోరూంలను తలదన్నే రీతిలో అన్ని హంగులతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ సమీపంలోని సంగాపురం రోడ్డులో సుమారు రెండు ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగం నుంచి అనుమతి వచ్చింది.

బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం..

  • రైతులకు అవసరమైన చిన్న చిన్న పని ముట్లు, ఆధునిక యంత్ర పరికరాలు, ఇతర ఉత్పత్తులన్నిటినీ మార్కెట్‌ ధర కంటే తక్కు వకే  రైతులకు విక్రయిస్తారు. ఇందుకోసం బహుళ జాతి కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలని డీసీఎంఎస్‌ నిర్ణయించింది.
  • మహీంద్రా, జాన్‌డీర్‌ వంటి ట్రాక్టర్‌ కంపె నీలు, పురుగుల మందులు, యంత్ర పరికరాలు ఉత్పత్తి చేసే ఇతర సంస్థల నుంచి నేరుగా యంత్రాలను కొనుగోలు చేసి ఈ కేంద్రంలో అందుబాటులో ఉంచుతారు. 
  • ఈ కేంద్రం ఏర్పాటుకు దాదాపు  రూ.8.50 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌సీడీసీ (నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నుంచి రూ.5 కోట్లు గ్రాంట్‌ రూపంలో తీసుకుంటున్నారు. డీసీఎంఎస్‌ నుంచి రూ.కోటిన్నర వినియోగించాలని భావిస్తున్నారు. మిగతా రూ.2 కోట్లు పత్యేక అభివృద్ధి నిధుల కింద మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
  • ఈ ప్రతిపాదనలకు సహకార శాఖ నుంచి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ రాగా, నిధుల మంజూరుకు సంబంధించిన ఫైలు ఆర్థికశాఖ పరిశీలనలో ఉంది. నిధులు మంజూరైన వెంటనే పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

రైతుల్లో అవగాహనకు ప్రత్యేక ఏర్పాట్లు
కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన యంత్రాలు, ఆధునాతన యంత్ర పరికరాల వినియోగం, సాగు వ్యయాన్ని తగ్గించే పద్ధతులు, దిగుబడి పెంచేందుకు ఉపయుక్తమైన పురుగుల మందులు, ఇతర ఉత్పత్తుల వాడకం...ఇలా పలు అంశాలపై ఈ కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం  కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీసీఎంఎస్‌ నిర్ణయించింది.

నిధులు మంజూరైన వెంటనే పనులు 
ఈ కేంద్రంలో సాగుకు అవసరమైనవన్నీ లభిస్తాయి. రైతులు ఒక్కోదాని కోసం ఒక్కో చోటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మార్కెట్‌లోకి వచ్చే ఆధునిక యంత్ర పరికరాలు, ఇతర ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గజ్వేల్‌లో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం పనులు.. నిధులు సమకూరిన వెంటనే  ప్రారంభిస్తాం.  
- మల్కాపురం శివకుమార్, డీసీఎంఎస్‌ చైర్మన్‌

మరిన్ని వార్తలు