అంతరిక్షంలో వ్యవసాయం

26 Mar, 2021 05:06 IST|Sakshi

వ్యవసాయానికి పనికొచ్చే వినూత్న బ్యాక్టీరియా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌/రాయదుర్గం: అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాములు అక్కడ తినడానికి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఆహార పదార్థాలను తీసుకెళ్తారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆ తిండి పదార్థాలకు బదులు అంతరిక్షంలోనే పండించిన సహజమైన ఆహారాన్ని వారు ఆస్వాదించొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. సుదూర గ్రహాలపై వ్యవసాయం చేసేందుకు సాయం చేసే వినూత్న బ్యాక్టీరియాను యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేపీఎల్‌)తో కలిసి చేసిన పరిశోధనల్లో ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్స్‌ గుర్తించినట్లు విశ్వవిద్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లే నౌకల్లో పలుచోట్ల కొత్తరకం బ్యాక్టీరియా ఒకదాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. మిథైలోబ్యాక్టీరియేజ్‌ అని పిలిచే ఈ బ్యాక్టీరియాలో ఒక రకం మిథైలోరూబ్రమ్‌ రోడిసియానమ్‌ కాగా, ఇప్పటివరకూ గుర్తించని బ్యాక్టీరియా రకాలు మరో మూడు ఉన్నాయి. వీటికి భారత్‌లో కనిపించే మిథైలోబ్యాక్టీరియమ్‌ ఇండికమ్‌తో దగ్గరి పోలికలు ఉన్నట్లు భారతీయ శాస్త్రవేత్త, అణ్ణామలై యూనివర్సిటీ మాజీ అధ్యాపకులు డాక్టర్‌ అజ్మల్‌ ఖాన్‌ గుర్తించారు.

ఈ కారణంగా ఆ బ్యాక్టీరియాకు మిథైలోబ్యాక్టీరియమ్‌ అజ్మలీ అని పేరు కూడా పెట్టారు. ఈ అజ్మలీ రకం బ్యాక్టీరియాలో మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడే జన్యువులు ఉన్నట్లు తదుపరి పరిశోధనల ద్వారా తెలిసింది. జేపీఎల్‌కు చెందిన కస్తూరి వెంకటేశన్, సి.సి.వాంగ్‌లతోపాటు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ పొదిలి అప్పారావు, సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రామ్‌ ప్రసాద్‌లు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వివరించింది. పరిశోధన వివరాలు ఫ్రాంటియర్స్‌ ఆఫ్‌ మైక్రోబయాలజీ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
 

ఇతర గ్రహాల బాట పట్టాల్సిందే! 
భూమ్మీది వనరులు ఏదో ఒకరోజు అంతరించే పరిస్థితి ఉండటం, జనాభాతోపాటు అవసరాలూ పెరిగిపోనున్న నేపథ్యంలో మనిషి ఇంకో వందేళ్లకైనా ఇతర గ్రహాల బాట పట్టాల్సిందేనని శాస్త్రవేత్తలు చాలాకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇందుకోసమే ఒకవైపు భూమిని పోలిన గ్రహాల కోసం అన్వేషణ ముమ్మరంగా కొనసాగుతూండగా.. ఇంకోవైపున భూ వాతావరణం లేని గ్రహాల్లోనూ మనిషి మనుగడ సాగించేందుకు అవసరమైన వాటిని సమకూర్చుకునే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలాన్‌ మస్క్‌ వంటి వారు ఇంకో ఐదేళ్లలోనే అంగారకుడిపై మానవులతో కూడిన కాలనీని ఏర్పాటు చేస్తానని రెండేళ్ల క్రితమే ప్రకటించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌ ద్వారా దశలవారీగా సామగ్రిని పంపి అంగారకుడిపైన వాతావరణాన్ని మనకు అనుకూలంగా మార్చి కాలనీని ఏర్పాటు చేస్తానని, వ్యవసాయంతోపాటు అన్ని రకాల వ్యవస్థల ఏర్పాటుకు తన వద్ద ప్రణాళికలు ఉన్నాయని మస్క్‌ చెబుతున్నారు. వీటి మాటెలా ఉన్నా.. మనిషి కనీస అవసరాలైన ఆహారం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చాలా కాలంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి.

అతితక్కువ గురుత్వాకర్షణ ఉన్న పరిస్థితుల్లో మొక్కలు ఎలా ప్రవర్తిస్తాయి? వాటి ఎదుగుదల ఎలా ఉంటుంది? వంటి అంశాలపై పలు దేశాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వేదికగా ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, నాసాల సంయుక్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణంగా వ్యవసాయంలో బ్యాక్టీరియా పాత్రపై సామాన్యులకు తెలిసింది తక్కువే. మొక్కల వేళ్ల వద్దకు పోషకాలను చేర్చడంలో బ్యాక్టీరియా కీలకపాత్ర పోషిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు గుర్తించిన అజ్మలీ రకం బ్యాక్టీరియా మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని ప్రాథమికంగా తెలిసినా... మరిన్ని పరిశోధనల ద్వారా ఈ అంశాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. శాస్త్రవేత్తల అంచనాలు నిజమైతే అంతరిక్షంలో మన కూడుకు ఢోకా లేనట్లే!! కాకపోతే ఈ విషయం తెలిసేందుకు మరికొంత సమయం పడుతుంది!!   

మరిన్ని వార్తలు