‘ఏఐ’ సాయంతో పండుగలా వ్యవసాయం.. ఎలాగంటారా?

7 Nov, 2021 02:14 IST|Sakshi

నకిలీ విత్తనాలు, ఎరువుల మోసాలు, అకాల వర్షాలు, కూలీల కొరత, మార్కెట్‌ మాయాజాలం... రైతుకు కాసిన్ని రూకలు గిట్టేందుకు తరచూ అడ్డుపడుతున్న సమస్యల చిట్టా ఇది. అయితే కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వీటన్నింటినీ అన్నదాత అధిగమించేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. దేశంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న స్టార్టప్‌లు వ్యవసాయాన్ని తిరిగి పండుగలా మార్చేందుకు కృషి చేస్తున్నాయి. దీంతో ఎరువులు వెదజల్లుతూ దూసుకెళ్లే డ్రోన్లు, విచ్చుకున్న పత్తికాయలను తెంపే రోబోలు పల్లెల్లో విరివిగా కనిపించే కాలం ఇంకెంతో దూరంలో లేదు!  

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయంలో వృద్ధిని సాధించడం ద్వారా రైతుతోపాటు ఇతర వర్గాల వారికీ లాభాలు చేకూర్చేందుకు కృత్రిమ మేధ (ఏఐ) అక్కరకొస్తోంది. పంట దిగుబడిని పెంచేందుకు, సకాలంలో తగిన సూచనలిచ్చి నష్టాలు, వృథాను అరికట్టేందుకు, కూలీల కొరత సమస్యను అధిగమించేందుకు సాయంగా నిలుస్తోంది. వ్యవసాయంలోని ప్రతి దశలోనూ రైతుకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నేల, నీరు, గాలి, వాతావరణం వంటి వాటిని నిత్యం పరిశీలిస్తూ రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఏఐ ఆధారిత సూక్ష్మ వాతావరణ కేంద్రాలు తయారవుతున్నాయి.

చీడపీడల నియంత్రణ, ఎరువులు ఎప్పుడు? ఎక్కడ? ఎంత మేరకు వాడాలి? కీటకనాశినులు ఏయే సమయాల్లో వాడాలో కూడా సెన్సర్లు, ఆప్టికల్‌ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. మార్కెట్‌ ధర వివరాలు ఇంటర్నెట్‌ సాయంతో తెలుసుకోవడం కొంతకాలంగా వినియోగంలో ఉన్నా ఏఐ పుణ్యమా అని ఇప్పుడు ఫలానా పంటకు సమీప భవిష్యత్తులో ఎంత ధర వచ్చే అవకాశం ఉంది? ఎక్కడ అమ్ముకుంటే ఎక్కువ లాభం వంటి వివరాలు ఇచ్చే ప్రిడిక్టివ్‌ అనాలసిస్‌ కూడా అందుబాటులోకి వస్తోంది. డ్రోన్ల సాయంతో పంట ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు కూడా కొన్ని సంస్థలు తగిన టెక్నాలజీలను సిద్ధం చేశాయి. సెన్సర్లు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా తీసిన ఫొటోలు, ఐఓటీ పరికరాలు, డ్రోన్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వ్యవసాయ సంబంధిత సమాచారం అంతటినీ ఒక దగ్గరకు చేర్చి అవసరాలకు తగ్గట్టుగా విశ్లేషించడం కూడా ఏఐ కారణంగానే సాధ్యమవుతోంది. 

  • దేశంలో దాదాపు 58 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలన్నీ కలిపి సుమారు రూ.19.48 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించాయని అంచనా. 


వివిధ స్టార్టప్‌లు తయారు చేసిన ఏఐ ఆధారిత వ్యవసాయ యంత్ర పరికరాలు, వాటి ఉపయోగాలు ఇలా...

  • కలుపు మొక్కలు ఏరేస్తుంది... 
    కంపెనీ: టార్టాన్‌సెన్స్, బెంగళూరు 
    https://www.tartansense.com/ 
    ఏం చేస్తుంది?.:
    కలుపు మొక్కలను గుర్తించి వాటిపై మందులు చల్లే బ్రిజ్‌బోట్, యంత్రాలతో పెకలించగలిగే బ్లేడ్‌ రన్నర్‌ రోబోలను సిద్ధం చేసింది. ఈ కంపెనీని 2015లో జయసింహరావు ఏర్పాటు చేశారు.  

    బ్రిడ్జ్‌బోట్‌


    బ్లేడ్‌రన్నర్‌

     

  • కొబ్బరిబొండాలు తెంపుతుంది... 
    కంపెనీ: మెగరా రోబోటిక్స్, చెన్నై
     http://www.megararobotics.com/ 
    ఏం చేస్తుంది?..: కొబ్బరి చెట్లు ఎక్కి బొండాలు తెంపేందుకు అమరన్‌ పేరుతో ఓ రోబోను తయారు చేసింది. రాజేశ్‌ కన్నన్‌ మహాలింగం అనే వ్యక్తి స్థాపించారు. స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్, జాయ్‌స్టిక్‌ లేదా గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్ఫేస్‌ల సాయంతో నియంత్రించగలిగే ఈ రోబో 15 మీటర్ల ఎత్తైన చెట్లను కూడా 15 సెకన్లలోనే ఎక్కగలదు. కేవలం పది నిమిషాల్లో ఏర్పాటు చేసుకుని పనిచేయించుకోగల అమరన్‌ మనుషుల మాదిరిగానే బొండాలను వేర్వేరుగా కాకుండా.. గుత్తులు తెంపగలదు. కిందకు మోసుకురాగలదు.

     

  • తెలివిగా వేరు చేస్తుంది.. 
    కంపెనీ: ఇంటెల్లో ల్యాబ్స్, గురుగ్రామ్‌
    https://www.intellolabs.com/ 
    ఏం చేస్తుంది?...: పంటలను గ్రేడింగ్‌ చేయడం, వేగంగా ప్యాక్‌ చేయడం, రవాణాపై పర్యవేక్షణ, పరిశీలనల కోసం ఈ కంపెనీ ఇంటెలోట్రాక్, ఇంటెలోసార్ట్, ఇంటెలోగ్రేడ్, ఇంటెలోప్యాక్‌ పేరుతో నాలుగు కృత్రిమమేధ ఆధారిత యంత్రాలను, సాఫ్ట్‌వేర్‌లను సిద్ధం చేసింది.  

     
  • అన్నీ తానై.. 
    కంపెనీ: ప్లాంటిక్స్, హైదరాబాద్‌
    https://plantix.net/en/ 
    ఏం చేస్తుంది?..: కృత్రిమ మేధ సాయంతో మొక్కలను ఆశించే చీడపీడలు, పోషకాల లోపాలను గుర్తించేందుకు ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా.. అవసరానికి మించి కీటకనాశినులు వాడకుండా నిరోధించడం కూడా ఈ ప్లాంటిక్స్‌ ద్వారా జరిగే పనుల్లో ఒకటి. 

     
  • విత్తనంతో మొదలుపెట్టి... 
    కంపెనీ: ఫసల్, బెంగళూరు
     https://fasal.co 
    ఏం చేస్తుంది?..: మీ పొలం వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తుంది. నేల సారాన్ని పరిశీలించడం మొదలుకొని వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడం వరకూ అన్ని పనులు చక్కబెట్టేందుకు ఫసల్‌ ఒక వ్యవస్థను తయారు చేసింది. సెన్సర్లు, ఇతర పరికరాల సాయంతో రానున్న 14 రోజుల వాతావరణ అంచనాలను రైతుకు తెలియజేస్తుంది. నీళ్లు ఎప్పుడు పెట్టాలి? ఎరువులు ఎప్పుడు వేయాలి? వంటి అంశాలపై సూచనలు చేస్తుంది. రైతుల వ్యవసాయ పద్దుల నిర్వహణకూ ఉపయోగపడుతుంది. 

     
  • పత్తి ఏరేందుకు... 
    కంపెనీ:  జీ–రోబోమ్యాక్, బెంగళూరు
    https://www.grobomac.com/ 
    ఏం చేస్తుంది?..:  పత్తి పువ్వులు ఏరేందుకు ఓ ప్ర త్యేక యంత్రాన్ని తయారు చేసిందీ కంపెనీ. అం తేకాకుండా వంకాయ, బెండ, క్యాప్సికమ్‌ వంటి వాటిని కోసేందుకూ రోబోలను సిద్ధం చేస్తోంది. త్రీడీ మెషీన్‌ విజన్, రోబోటిక్స్‌ టెక్నాలజీల సా యంతో మనుషులు కష్టపడి చేయగల పనులను సులువుగా ముగించేందుకు ప్రయత్నిస్తోంది. కో తలకు ఉపయోగించే యంత్రాలనే.. కలుపుతీతలకు, ప్రూనింగ్, మందుల పిచికారీకి కూడా ఉపయోగించుకోగలగడం విశేషం. పత్తిపువ్వులు ఏరే యంత్రం రెండేళ్ల నుంచి పొలాల్లో పనులు చేసుకుంటూండటం చెప్పకోవాల్సిన అంశం.  
     

మరిన్ని వార్తలు