పీసీసీ చీఫ్‌పై ఇన్ని ఫిర్యాదులా? రేవంత్‌పై అసంతృప్తికి గల కారణాలేంటి?

24 Nov, 2022 03:54 IST|Sakshi

రేవంత్‌పై నేతల్లో అసంతృప్తికి గల కారణాలేంటి? 

మాణిక్యం, ముగ్గురు ఇన్‌చార్జ్‌ కార్యదర్శులను ఆరా తీసిన ఖర్గే 

సీనియర్ల మధ్య సమన్వయం సాధించడంపై దృష్టి పెట్టాలని సూచన 

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌పై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి సీనియర్లు, ఇతర నేతల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని.. దీనికి కారణాలేంటని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరా తీశారు.  ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, ఇన్‌చార్జి కార్యదర్శులు బోసురాజు, రోహిత్‌ చౌదరి, నదీం జావేద్‌లకు సూచించారు. పార్టీ సీనియర్లతో రేవంత్‌కు ఉన్న అభిప్రాయభేదాలు, సమన్వయలేమిని వెంటనే పరిష్కరించేలా నేతలందరితో మాట్లాడాలని మార్గదర్శనం చేశారు.

పార్టీ వీడే అవకాశం ఉన్న నేతలతో ప్రత్యేకంగా చర్చించి వారి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం వెంటనే చేపట్టాలని ఆదేశించారు. బుధవారం ఢిల్లీలో మాణిక్యం ఠాగూర్‌ సహా ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, మునుగోడు ఉప ఎన్నిక, మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజు నోటీసులు, రేవంత్‌పై వస్తున్న వరుస ఫిర్యాదులపై చర్చించారు. ముఖ్యమైన అంశాల్లో సీనియర్ల అభిప్రాయాన్ని గౌరవించకపోవడం, సామాన్య కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, భూముల వ్యవహారాలకు సంబంధించిన అంశాలు మినహా ఇతర ప్రజా సంబంధిత సమస్యలపై పోరాటం చేయకపోవడం వంటి అంశాలపై ఫిర్యాదు చేశారని.. వీటిని సరిదిద్దే బాధ్యతను మీరు తీసుకోవాలంటూ ఖర్గే సూచించారు. 

అసంతృప్త నేతలను గుర్తించండి  
మర్రి శశిధర్‌రెడ్డి వంటి సీనియర్‌ నేతలు పార్టీ వీడే అవకాశం ఉన్నా... పీసీసీ చీఫ్‌ సహా ఇతర రాష్ట్ర నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడంపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీనియర్లు ఎవరైనా అసంతృప్తితో ఉంటే, అలాంటి వారిని ముందే గుర్తించి చర్చలు జరపాలని.. అధిష్టానం దృష్టికి ఆయా అంశాలను తీసుకురావాలని పేర్కొన్నారు. పార్టీలో అసంతృప్తి పెరిగితే తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అవకాశాలు పెరుగుతాయని, వీటిని కట్టడి చేసే చర్యలు ముందుగానే తీసుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యల విషయంలో తొందరపాటు వద్దని, ఆచితూచి నిర్ణయం తీసుకుందామని ఖర్గే చెప్పారని సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏవిధంగా సమాయత్తం కావాలి? శ్రేణులను ఏ విధంగా కాపాడుకోవాలి? తదితర అంశాలపై అనుసరించాల్సిన ప్రణాళికలను ఖర్గే సూచించారు.  

ఇదీ చదవండి:  రామోజీ మీ టూరిజానికి ఆ భూములే కావాలా?: సీపీఎం

మరిన్ని వార్తలు